చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ తమ్ముడు, మాల మహానాడు నాయకుడు రామచంద్రపై... ఆదివారం దాడి జరిగింది. రాడ్లతో దాడి చేయడం వల్ల రామచంద్ర ముఖం, ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత... మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో మదనపల్లెకు తీసుకెళ్లారు.
కారులో వచ్చిన ఆరుగురు వ్యక్తులు తనపై దాడి చేసినట్లు రామచంద్ర తెలిపారు. బాలికల ఉన్నత పాఠశాల వద్ద ఉండగా... ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. రోడ్డుపైనున్న తోపుడు బండి పక్కకు తీయాలంటూ కారులోని వారు గొడవ పడ్డారని.... ఆ సమయంలో అక్కడే ఉన్న తాను జోక్యం చేసుకోవడంతో దాడి చేశారని చెప్పారు. రామచంద్రపై దాడి వెనుక రాజకీయ కోణం లేదని మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి తెలిపారు.
డీజీపీకి చంద్రబాబు లేఖ
జడ్జి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై దాడిని తెలుగుదేశం తీవ్రంగా ఖండించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించి, ఎస్సీలపై దాడులు పెరిగిపోతున్నాయంటూ డీజీపీ గౌతం సవాంగ్‌కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. బడుగు, బలహీనవర్గాలే లక్ష్యంగా అరాచకాలు జరుగుతున్నాయని.. రామచంద్రను గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.