Jubleehills Gang Rape: ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నా.. ఇంకా ఎన్నో సందేహాలు..!! - jubilee hills gang rape case investigation Details
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌లో 17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసులో ఇన్నోవా కారు కీలకంగా మారింది. శనివారం సాయంత్రం నగరశివారులోని మొయినాబాద్ ప్రాంతంలో నిందితులు ఘాతుకానికి ఉపయోగించిన ఇన్నోవా కారును పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
car
By
Published : Jun 4, 2022, 7:34 PM IST
|
Updated : Jun 4, 2022, 10:14 PM IST
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో 17ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ఇందులో పెద్దల ప్రమేయం ఉండటం వల్లే కేసు దర్యాప్తు సరిగా జరగడం లేదని విపక్షాలు ఆందోళనకు దిగడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు మైనర్లు, ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇంకా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమ్నీషియా పబ్‌లో మే 28న పార్టీ ఇచ్చింది ఎవరు? బాలికను తీసుకెళ్లిన ఇన్నోవా కారు ఎవరిది? ఇన్నోవా కారులో బాలికపై సామూహిక అత్యాచారం జరిగితే రెడ్ కలర్ మెర్సిడెస్ బెంజ్ కారును పోలీసులు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు? ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు కానీ, ఇన్ని రోజులు ఇన్నోవా కారును ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? ఇప్పటివరకు ఆ కారు ఎక్కడుంది..? అనే సందేహాలను పోలీసులు నివృత్తి చేయలేకపోయారు. పెద్ద ఎత్తున సందేహాలు వెల్లువెత్తటంతో.. శనివారం సాయంత్రం నగరశివారులోని మొయినాబాద్ ప్రాంతంలో ఘాతుకానికి ఉపయోగించిన ఇన్నోవా కారును పోలీసులు గుర్తించి ఎట్టకేలకు స్వాధీనం చేసుకున్నారు. ఆ కారును జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అత్యాచార ఘటన కారులోనే జరగడంతో ఈకేసులో ఇన్నోవా కారు కీలక ఆధారం కానుంది. ఎమ్మెల్యే కుమారుడు.. ఘటన జరక్కముందే అక్కడి నుంచి వెళ్లిపోయాడని స్పష్టంగా చెబుతున్న పోలీసులు ఇన్నోవా కారు ఎవరిదనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఈ కేసుకు సంబంధించి భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు.. కొన్ని వీడియోలు, ఫొటోలు మీడియాకు విడుదల చేయడం కలకలం రేపింది. రఘునందన్‌కు ఆ దృశ్యాలు ఎలా లభించాయనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరో వైపు ఘాతుకం జరిగిన ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనంగా పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారును గుర్తించినట్టు సమాచారం. ప్రస్తుతం ఓ రహస్య ప్రదేశంలో పట్టుబడ్డ ఇద్దరు నిందతులను విచారిస్తున్న పోలీసులకు మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశముందని భావిస్తున్నారు. ఇన్నోవా కారు ప్రభుత్వ వాహనమైతే ఈకేసు మరి కొందరి మెడకు చుట్టుకునే అవకాశముందని భావిస్తున్నారు.
అత్యాచారం జరిగింది ఇన్నోవా కారులోనే: పోలీసులు
జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 36లోని అమ్నీషియా పబ్‌లో మే 28న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 6 గంటల వరకు ఒక బృందం మద్యం రహిత (నాన్ లిక్కర్ ఈవెంట్) వేడుకను నిర్వహించింది. ఇందులో 150 మంది పాల్గొన్నారు. వీరిలో 80 శాతానికి పైగా మైనర్లే. వారిలో ఒక బాలిక పబ్‌లో పరిచయమైన స్నేహితులతో సరదాగా గడిపింది. సాయంత్రం 5.45 గంటల ప్రాంతంలో ఒక బాలుడు (16), మిగిలిన స్నేహితులతో కలిసి కిందకు వచ్చింది. వారిలో ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కుమారుడు, ఒక ఎమ్మెల్యే కుమారుడు, మరికొందరు ఉన్నారు. వారు బాలికను బెంజి కారులో ఎక్కించుకుని.. బంజారాహిల్స్‌లోని ఓ బేకరీ వద్దకు వెళ్లారు. అక్కడ అరగంట పాటు సరదాగా గడిపారు. వేరే కారులో ఇంట్లో దింపుతామంటూ ప్రభుత్వ సంస్థ ఛైర్మన్ కుమారుడు బాలికకు చెప్పాడు. ఆమెను వెంటబెట్టుకుని 6.30 గంటల ప్రాంతంలో అతడు, మరో అయిదుగురు ఇన్నోవా వాహనంలో బయలుదేరారు. మధ్యలో ఎమ్మెల్యే కుమారుడు దిగి వెళ్లిపోయినట్లు సీసీ కెమెరాల్లో దృశ్యాలను పోలీసులు గుర్తించారు. మిగిలిన అయిదుగురు ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కారులోనే అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు బాధితురాలిని అమ్నీషియా పబ్ వద్ద దింపేసి వెళ్లారు.
రంగంలోకి అబ్కారీ శాఖ..
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై ఆబ్కారీ శాఖ ఆరా తీస్తోంది. మైనర్లను పబ్‌లోకి అనుమతించకూడదని నిబంధనలు ఉన్నప్పటికీన వారిని ఎలా అనుమతించారని ప్రతి పక్షాలు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆబ్కారీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. మైనర్లను పబ్‌లోకి ఎలా అనుమతించారనే విషయంపై ఆరా తీశారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతోపాటు పబ్ యాజమాన్యం నుంచి వివరాలు సేకరించారు. ఓ కార్పొరేట్ స్కూల్ పేరుతో ఉస్మాన్ అనే విద్యార్థి ఫేర్‌వెల్ పార్టీకి అనుమతి తీసుకున్నట్లు తెలిసింది. 150 మంది విద్యార్థుల కోసం పబ్ బుక్ చేశారు. పార్టీ కోసం పబ్‌కు రూ.2 లక్షలు చెల్లించారు. దీంతో భవనంలోని నాలుగో అంతస్తులో పార్టీ నిర్వహణకు పబ్ యాజమాన్యం అనుమతి ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. అయితే, మద్యం సరఫరా చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవని, కూల్ డ్రింక్‌లు మాత్రమే సరఫరా చేసినట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు పూర్తి వివరాలతో కూడిన నివేదికను అధికారులు.. అబ్కారీ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు.