JP Nadda Comments: బండి సంజయ్ యాత్రకు తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన 'జనం గోస- భాజపా భరోసా' బహిరంగసభలో పాల్గొన్న జేపీ నడ్డా... తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ ఆశీర్వాదం ఉందన్నారు. భాజపా సర్కార్ చాలా బాధ్యతాయుతమైనదని స్పష్టం చేశారు. మోదీ సర్కార్ 130 కోట్ల మందికి ఉచిత కొవిడ్ టీకాలు ఇచ్చిందని తెలిపారు. వ్యాక్సినేషన్ వల్లే ఇవాళ మాస్క్లు లేకుండా కూర్చోగలిగామన్నారు.
JP Nadda on Modi: పాశ్చాత్య దేశాలకు సాధ్యం కానిది మోదీ సర్కార్ చేసి చూపిందని జేపీ నడ్డా వెల్లడించారు. మోదీ సర్కార్ రెండేళ్ల పాటు ప్రజలకు ఉచితంగా రేషన్ అందజేసిందని గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా 130 కోట్ల మందికి బియ్యం, గోధుమలు ఉచితంగా ఇచ్చిందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకంపై దేశమంతా సంతోషంగా ఉందని చెప్పారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరేందుకు కేసీఆర్ మాత్రం నిరాకరించారని ఆరోపించారు.
JP Nadda on KCR: అవినీతిలో తెలంగాణ సర్కార్ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని జేపీ నడ్డా అన్నారు. సాగునీటి ప్రాజెక్టులను కేసీఆర్ సర్కార్ భ్రష్టు పట్టించిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంలాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కొత్తగా ఒక్క ఇంచు భూమికీ నీరు ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సి ఉందని అన్నారు.