జస్టిస్ జోయ్మల్య బాగ్చి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టులో సోమవారం ఉదయం 10:15 గంటలకు వర్చువల్గా నిర్వహించనున్నారు. జస్టిస్ జోయ్మల్య బాగ్చితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ప్రమాణం చేయించనున్నారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ జోయ్ మల్య బాగ్చి ఏపీ హైకోర్టుకు బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఏపీ హైకోర్టు జడ్జీల సీనియారిటీలో జస్టిస్ బాగ్చి రెండో స్థానంలో కొనసాగుతారు. మరో వైపు ఏపీ హైకోర్టు సీజే జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి సిక్కిం హైకోర్టు సీజేగా బదిలీపై వెళుతున్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం 3:30 గంటలకు హైకోర్టు న్యాయమూర్తులు వీడ్కోలు పలకనున్నారు.
మరోవైపు జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈనెల 6 న ప్రమాణం స్వీకారం చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జస్టిస్ ఏకే గోస్వామితో ప్రమాణం చేయించనున్నారు. సిక్కిం హైకోర్టు సీజేగా పనిచేస్తున్న జస్టిస్ ఏకే గోస్వామి ఏపీ హైకోర్టు సీజేగా బదిలీ అయిన సంగతి విదితమే.