AP Govt Talks with Employees Union: పీఆర్సీ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరుపనుంది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల నేతలంతా ఇవాళ (బుధవారం) సాయంత్రం ఐదు గంటలకు సచివాలయంలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆర్థిక శాఖలోని మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి సమాచారం పంపారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో ఆర్ధిక శాఖ అధికారులతో ఈ సమావేశం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్ లో ఈ సమావేశం నిర్వహించనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక శాఖ అధికారులతో నిర్వహించే ఈ సమావేశంలో శాఖలవారీగా అంశాలపై ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చించనుంది. పీఆర్సీ పై ఇప్పటికే అధికారుల కమిటీతో సమీక్షించిన సీఎం.. మరోమారు ఉద్యోగ సంఘాలతో చర్చించి ప్రతిపాదనలు తీసుకురావాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే సీఎస్ అధ్యక్షతన రేపు సమావేశం జరుగనుంది.
ప్రభుత్వం నుంచి సమాచారం అందింది - బండి శ్రీనివాసరావు
AP NGO President Bandi Srinivasa Rao On PRC: ఉద్యోగుల డిమాండ్లపై కార్యదర్శుల సమావేశం రేపు నిర్వహిస్తామని ప్రభుత్వం సమాచారం పంపిందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఉద్యోగుల విజ్ఞప్తులకు సంబంధించిన అంశాలపై సమాచారం ఇచ్చేందుకు సచివాలయంలో ఆర్థిక శాఖ మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ ను కలిశామని వెల్లడించారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో పీఆర్సీ అంశాలపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో అంశాల వారీగా చర్చిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసిందని వివరించారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఆశించారని అయితే ఆ ప్రకటన రాదని తెలిసి నిరాశ చెందామని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఇస్తున్న 27 శాతం కంటే ఎక్కువ ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టుగా సజ్జల తెలిపారన్నారు. తెలంగాణా కంటే మెరుగ్గానే పీఆర్సీ ప్రకటన ఉంటుందని ఆశిస్తున్నట్టు బండి స్పష్టం చేశారు.