పీఆర్సీ నివేదికను తక్షణం బహిర్గతం చేయాలంటూ రెండు ప్రభుత్వ ఉద్యోగుల ప్రధాన యూనియన్లు సచివాలయంలో బైఠాయించటంతో ప్రభుత్వం అత్యవసరంగా మరో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. గత నెల 29 తేదీన నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో వారంలోగా పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేరకపోవటంతో ఏపీ జేఎసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాలు సచివాలయంలో బైఠాయించాయి. దీంతో ప్రభుత్వం అత్యవసరంగా సీఎస్ నేతృత్వంలో మరోమారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అక్టోబరు 29 తేదీ నాటి సమావేశంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన హామీలు లేకపోవటంతో ఈసారి గట్టిగా నిలదీయాలని ఉద్యోగ సంఘాలు సమాయత్తం అవుతున్నాయి. సచివాలయం ఐదో బ్లాక్ లోని నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావాల్సిందిగా గుర్తింపు పొందిన 13 ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం అత్యవసర సమాచారం పంపింది. అక్టోబరు 29 తేదీన నిర్వహించిన సమావేశంలోని అంశాలు, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చించనున్నట్టు ఆర్ధిక శాఖలోని మానవ వనరుల విభాగం ముఖ్యకార్యదర్శి ఉద్యోగ సంఘాల నేతలకు లేఖ రాశారు. మద్యాహ్నం 2 గంటలకు నిర్వహించే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, అంశాలను చర్చించనున్నట్టు ప్రభుత్వం పేర్కోంది. అయితే ప్రధానంగా 11వ పీఆర్సీ అమలు పైనే ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
పీఆర్సీ నివేదికను ఎందుకు దాస్తున్నారో తెలియట్లేదు. మా డిమాండ్లను 11వ పీఆర్సీలో నివేదించాం. మా డిమాండ్లను పీఆర్సీ కమిటీ నివేదించిందో లేదో తెలియదు. పీఆర్సీ నివేదికను ఎందుకు బయటపెట్టడం లేదు. మా నివేదిక కాపీని మాకు ఇవ్వాలని కోరుతున్నాం. - బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీజేఏసీ ఛైర్మన్