ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జేఈఈ మెయిన్​.. విద్యార్థుల పట్ల కఠిన పరీక్షే..! - పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల అవస్థలు

రాత్రంతా ప్రయాణం... కంటి నిండా నిద్ర కరవు... కనీసం కాలకృత్యాలు తీర్చుకునే సౌకర్యాలు లేవు. ఆడపిల్లలైతే మూత్రశాలలు లేక ఉగ్గపట్టుకుని ఉండాల్సిన దుస్థితి. అల్పాహారమైన దొరకని పరిస్థితి. జేఈఈ మెయిన్‌ పరీక్ష రాసేందుకు హైదరాబాద్‌కు వచ్చిన విద్యార్థుల కష్టాలు... ఈనాడు-ఈటీవీ భారత్​ పరిశీలనలో వెలుగు చూశాయి. కరోనా దెబ్బకు ఇప్పటికే ఆశలన్నీ తలకిందులు కాగా... విపత్కర పరిస్థితుల్లో పరీక్షా కేంద్రాల వద్ద దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.

jee-main-students-facing-problems-with-facilities-at-centers
జేఈఈ మెయిన్ పరీక్ష

By

Published : Sep 5, 2020, 7:44 AM IST

జేఈఈ మెయిన్ పరీక్షలు రాసేందుకు జిల్లాల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకరోజు ముందుగానే గ్రామాల నుంచి నగరానికి చేరుకుంటున్న అభ్యర్థులు... రాత్రంతా ప్రయాణానికే సమయం కేటాయిస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న క్రమంలో... రాత్రి 11 బయలుదేరితే తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో పరీక్షా కేంద్రాల వద్దకు వస్తున్నారు. ఆకలి కడుపుతో వాహనాల్లోనే కునుకు తీస్తుండగా... కనీసం మంచినీరు, టీ తాగేందుకు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. మూడు గంటలు జరిగే పరీక్షకు పది గంటలకుపైగా ప్రయాణం చేస్తున్నారు.

ఖాళీ కడుపుతోనే పరీక్షా కేంద్రాల్లోకి వెళ్తున్న విద్యార్థులు... పరీక్ష పూర్తయ్యేసరికి నీరసించి పోతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా శిక్షణకు దూరమై... మొక్కుబడిగానే పరీక్ష రాస్తున్నట్టుగా విద్యార్థుల అభిప్రాయపడుతున్నారు. పరీక్షలు నిర్వహించేందుకు నిర్ణయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం రవాణా సౌకర్యాలు కూడా కల్పించలేదని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి వేల రూపాయలు ఖర్చు పెట్టి పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోందని... సరైన విశ్రాంతి లేకపోవడంతో పరీక్షలపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నట్టు చెబుతున్నారు.

కరోనా దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మూత్రశాలల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ... జేఈఈ పరీక్షల నిర్వహణపై ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు... సరైన సౌకర్యాలు కల్పించకపోవటంపై ఆందోళన చెందుతున్నారు. కేంద్రాల వద్ద కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నా అక్కడికి చేరుకోవటం... తిరిగి వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:నేర్పాలంటే... నేర్చుకోవాల్సిందే!

ABOUT THE AUTHOR

...view details