రాష్ట్రాన్ని విభజించి సోనియాగాంధీ తప్పు చేశారని తెదేపా నేత జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇక కాలం చెల్లిందంటూ జేసీ వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ ఏర్పాటుచేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదని జేసీ సహా కాంగ్రెస్ నేతలు అన్నట్లు సమాచారం. చంద్రబాబు తరహాలో జగన్‌కు నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీల్లో రావాల్సి వస్తుందంటూ చురకలు అంటించారు. తెలంగాణలో షర్మిల.. రాజకీయాలు ప్రాక్టీసు చేస్తున్నారన్న ఆయన... ఏడాది, ఏడాదిన్నరలో ఆంధ్రాలో రాజన్న రాజ్యం కోసం పోరాడతారని జోస్యం చెప్పారు.
తెలంగాణ శాసనసభ ప్రాంగణానికి వచ్చిన జేసీ దివాకర్‌రెడ్డి... కాంగ్రెస్ శాసన సభాపక్ష కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పొడెం వీరయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో సరదాగా సంభాషించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి సోనియా గాంధీ అందరికీ అన్యాయం చేశారని దివాకర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్‌కు నష్టం చేశారన్న జేసీ.. విభజిస్తే పార్టీ తీవ్రంగా నష్టపోతుందని సోనియాకు చెప్పానన్నారు. కొందరు తెలంగాణ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారని చెప్పుకొచ్చారు. అయితే తాము ఎవరమూ ముఖ్యమంత్రి పదవులను ఆశించలేదని జీవన్‌రెడ్డి, భట్టి విక్రమార్క అన్నారు.
కిరణ్‌కుమార్‌రెడ్డికి అదృష్టం కలిసివచ్చింది..
తాను కాంగ్రెస్ పార్టీలో జన్మించానన్న దివాకర్‌రెడ్డి... తల్లిలాంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నిందించడం సరికాదన్నారు. కాంగ్రెస్‌కు రాసిపెట్టిన కాలం అయిపోయిందని అభిప్రాయపడ్డారు. తమను ఇంతస్థాయికి పెంచిన కాంగ్రెస్‌కు కాలం తీరడం బాధాకరమన్నారు.. జేసీ. జైపాల్ రెడ్డిని ముఖ్యమంత్రి కావాలని కోరితే ఆయన సుముఖత వ్యక్తం చేయలేదన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుచేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కిరణ్‌కుమార్‌రెడ్డికి అదృష్టం కలిసి వచ్చిందని.. అందుకే ముఖ్యమంత్రి అయ్యారని జేసీ వ్యాఖ్యానించారు.
జగన్, షర్మిల మధ్య విభేదాలు!..
జగన్, షర్మిల మొండివారని.. వైఎస్ తనకు చెప్పేవారన్నారు జేసీ దివాకర్‌రెడ్డి. అన్నాచెల్లెల్ల మధ్య విభేదాలు ఉన్నాయని తెలిపారు. షర్మిల ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాల ప్రాక్టీసు చేస్తోందని... ఏడాది, ఏడాదిన్నర తర్వాత తన రాజకీయాన్ని ఏపీకి మారుస్తుందని జోస్యం చెప్పారు. ఏపీలోనూ రాజన్న రాజ్యం లేదని షర్మిల రాజకీయం చేస్తుందని, అప్పుడు కేంద్రంలోని భాజపా నేతలు ఏం చేస్తారో చూడాలన్నారు. షర్మిల రాజకీయం చేయాలని చూస్తే తెలంగాణ ప్రజలు పిచ్చివాళ్లా అని ప్రశ్నించిన జేసీ.... ఆమెకు ఐదు శాతం ఓట్లు వస్తే గొప్పా అని అభిప్రాయపడ్డారు.
జగన్ కోసం లారీల్లో నోటీసులు..
జగన్ మనస్తత్వం ప్రకారం చంద్రబాబుపై ఎప్పుడో కేసులు పెట్టాల్సి ఉండేదని, తమ వీపులు వాయించినపుడే వాళ్ల వీపులూ వాయించాల్సి ఉండేదని జేసీ అన్నారు. ఎందుకు ఆలస్యం అయిందో జగనే చెప్పాలన్నారు. చంద్రబాబునాయుడుకు ఒక్క పోలీస్ అధికారి వచ్చి నోటీసు ఇచ్చారన్న దివాకర్‌రెడ్డి.. ఏపీ సీఎం జగన్, విజయసాయిరెడ్డికి నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీలో తీసుకురావాల్సి వస్తుందని ఎద్దేవా చేశారు.
వైజాగ్ భూములన్నీ విజయసాయిరెడ్డి చేతుల్లోనే!
అమరావతి భూములు ఎక్కడికి పోలేదని... వైజాగ్ భూములన్నీ విజయసాయిరెడ్డి చేతుల్లో ఉన్నాయని అక్కడ సముద్రం, బీచ్ తప్ప ఏమీ మిగల్లేదని ఆరోపించారు. జగన్ జైలుకు వెళ్లే అవకాశాలు కనిపించడం లేదని చెప్పారు.
కాంగ్రెస్ పని అయిపోయింది!
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు పోరాడుతున్నారని, అయితే వాళ్ల పోరాటం ఫలించే పరిస్థితి కనిపించడం లేదన్నారు... జేసీ దివాకర్‌రెడ్డి. రెండు, రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పూర్తిగా తుడుచుపెట్టుకుపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో.. తెరాస, వైకాపా కాలం నడుస్తోందని తెలిపారు. ఎన్నాళ్లు ఉంటుందో చూద్దామన్నారు.