తెలంగాణ జయశంకర్ వర్సిటీ.. భారత వ్యవసాయ పరిశోధన మండలి(ఐసీఏఆర్) సూచనతో హైడ్రోపోనిక్స్ విధానంలో పశుగ్రాసాల సాగు ప్రాజెక్టు చేపట్టింది. తొలుత బొబ్బర్లు, మొక్కజొన్నను నీటిలో పెంచారు. విత్తనం వేసినప్పటి నుంచి 9 రోజుల్లోనే నీటి ట్రేలలో మొక్కజొన్న పైరు పశువుల మేతకు ఉపయోగించే స్థాయికి పెరిగింది. కిలో మొక్కజొన్న విత్తనాలను రూ.15కు కొనగా వాటి నుంచి 5 కిలోల మేత వచ్చింది. ఒక చదరపు మీటరు ట్రేలో 2.2 కిలోల మొక్కజొన్న విత్తనాలు వేసి పండించారు.
ముడి మాంసకృత్తులు
ట్రేలో పెరగడం వల్ల తెగుళ్లు, కీటకాలు లేకుండా నాణ్యమైన మొక్కలు వచ్చాయి. ఈ పైరులో 10 శాతం మాంసకృత్తులు, 59 శాతం పీచు పదార్థం, 2.9 శాతం ఖనిజ లవణాలు, 11 శాతం ఎండు పదార్థం ఉన్నాయి. దీనిని పశువులకు మేపితే పాల దిగుబడి పెరుగుతుందని తేలింది. బొబ్బర్ల మొక్కల్లో 50 శాతం ముడి మాంసకృత్తులున్నట్లు గుర్తించారు. మండు వేసవిలో సాగునీటి కొరత ఉన్నప్పుడు తక్కువ నీటితో, తక్కువ వ్యవధిలో ఎక్కువ పశుగ్రాసాన్ని ఈ విధానంలో పండించవచ్చని, తద్వారా పాడి పశువులకు దాణా కొరత లేకుండా చూడవచ్చని వర్సిటీ ఆచార్యులు చెబుతున్నారు. అలానే ఇంటింటికీ ఆకుకూరల్ని సులభంగా పండించుకోవచ్చని చెబుతున్నారు.
ఏమిటీ హైడ్రోపోనిక్స్...
నీటిలో పంటలు పండించే విధానాన్ని వాడుక భాషలో ‘హైడ్రోపోనిక్స్’ అని పిలుస్తున్నారు. పంటల సాగుకు నేల ఎక్కువగా అందుబాటులో లేని దేశాల్లో ఈ విధానంలో పంటలు సాగు చేస్తున్నారు. హరిత పందిరిలో నియంత్రిత వాతావరణంలో గొట్టాలు, ట్రేలు ఏర్పాటుచేసి వాటిలో నీటిని నింపి మొక్కలు పెంచుతారు. సూక్ష్మపోషకాలను ద్రావణం రూపంలో అందిస్తారు. ఈ ద్రావణాల ధర లీటరు రూ.500-1000 వరకూ ఉంది.