రాష్ట్రంలో కరోనా పరిస్థితి, కేసుల నమోదు, క్వారంటైన్, నిర్థరణ పరీక్షలు వంటి పలు అంశాలపై మంత్రి పేర్నినాని, వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
దిల్లీ మర్కజ్ వెళ్లి వచ్చిన వారి వివరాలను సేకరించామని జవహర్ రెడ్డి తెలిపారు. వీరి సంఖ్య సుమారు వెయ్యికి పైగా ఉంటుందని చెప్పారు. సర్వే ద్వారా కొవిడ్-19 లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నామని వెల్లడించారు. అనుమానితుల నుంచి నమూనాలు సేకరిస్తున్నామని తెలిపిన ఆయన...'మర్కజ్ వెళ్లినవారు, వాళ్ల ప్రైమరీ కాంటాక్ట్ వారు కలిపి 3500 మంది నమూనాలు సేకరించాం. వీటిలో 304 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో 260కి పైగా మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారే ఉన్నారు. లాక్‌డౌన్ పరిస్థితి ఎలా ఉంటుందో గమనించి హాట్‌స్పాట్స్‌ను గుర్తించాలి. ఎక్కడైతే కేసులు వచ్చాయో అక్కడ ఆంక్షలు కొనసాగే పరిస్థితి ఉంటుంది. ర్యాపిడ్ టెస్టులు చేస్తేనే మరిన్ని వివరాలు తెలుస్తాయి. దీనిద్వారా హాట్‌స్పాట్స్ పరిధి తెలుసుకోవచ్చు. వైరస్ వచ్చిన వాళ్లలో 80 శాతం మంది ఆస్పత్రికి వచ్చే పరిస్థితి ఉండదు. 15 శాతంమందికి మాత్రమే సేవలు అవసరమవుతాయి. హోమ్ ఐసొలేషన్‌లో భౌతిక దూరం పాటిస్తూ ఉంటే త్వరగా కోలుకోవచ్చు. జిల్లాకు 2 వేల బెడ్లకు తక్కువకాకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాకు ఒకటి చొప్పున 13 కొవిడ్ ఆస్పత్రుల ఏర్పాటుతో పాటు... రాష్ట్రస్థాయిలో 4 కరోనా ఆసుపత్రులు అందుబాటులో ఉన్నాయి'అని వివరించారు.
ప్రస్తుతం 12 వేల పీపీఈలు , 20 వేల ఎన్-95 మాస్కులు ఉన్నాయని జవహర్‌రెడ్డి తెలిపారు. 20 లక్షల పీపీఈల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వైరస్ రాకుండా ముందుగా ఇచ్చే డోస్‌లు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన... లాక్‌డౌన్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయని స్పష్టం చేశారు.