employees Salaries paid from an anonymous account : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడూ లేని విధంగా జనవరి నెల జీతాలను అనామతు ఖాతా నుంచి చెల్లించారు. జీతాల హెడ్ ఆఫ్ అకౌంటు 010 పద్దు ఉండగానే అనామతు ఖాతా 8658 ద్వారా చెల్లింపులు సాగాయి. జీతాల పద్దు ఉండగా ఇలా అనామతు ఖాతాల ద్వారా రూ.వందల కోట్ల చెల్లింపులు చేయడమేంటనే ప్రశ్న వినిపిస్తోంది. సాధారణంగా దేనికీ చెందని, అనేక సందేహాలున్న మొత్తాలను అనామతు ఖాతాలో జమ చేస్తుంటారు. ఆనక వాటిని సర్దుబాటు చేస్తుంటారు. రాష్ట్రంలో సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ వచ్చాక ఇలా అనామతు ఖాతాల ద్వారా చెల్లింపులు దాదాపు లేవని ఆర్థికశాఖలో గతంలో పనిచేసిన వారు చెబుతున్నారు. ఎంతో అవసరమైతే తప్ప అలా చెల్లింపులు చేయరని పేర్కొంటున్నారు.
అనామతు ఖాతాను పూర్తిగా నియంత్రించినందుకు ఏపీ ఆర్థికశాఖను అభినందిస్తూ గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అధికారులు లేఖ రాశారని తర్వాత కొద్ది రోజులకే చెల్లింపులు సాగాయని పేర్కొంటున్నారు.
ఏప్రిల్‌లో...:
ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల మొదటి రెండు రోజుల్లోనే అనామతు ఖాతా నుంచి దాదాపు రూ.3,000 కోట్లను చెల్లించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఆఖరు రోజున బిల్లుల చెల్లింపులకు చివరి నిమిషంలో రిజర్వుబ్యాంకుకు వర్తమానం పంపారు. ఆ మేరకు చెల్లింపులు జరగలేదు. ఆరోజు అర్ధరాత్రితో ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన బడ్జెట్ ప్రకారం చెల్లింపులకు మార్చి 31 ఆఖరు తేదీ. ఆ మర్నాడు చెల్లింపులకు వీల్లేదు. ఆర్‌బీఐ ఆరోజు ఆమోదించని మొత్తానికి, మరికొన్ని బిల్లుల చెల్లింపులకు ఆర్థికశాఖ అధికారులు అనామతు ఖాతా ఎంచుకున్నారు. మొదట ఆ మొత్తాలను అనామతు ఖాతాకు బదిలీ చేసి ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో చెల్లింపులు జరిపారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రేగాయి. అనామతు ఖాతా ద్వారా చెల్లింపుల సమాచారం బయటపడిందని ఆర్థికశాఖ అధికారులు అప్పట్లో ఆందోళన చెందారు. అలాంటిది ఇప్పుడు జనవరి నెల జీతాలకు ఏకంగా రూ.వేల కోట్లు అనామతు ఖాతా ద్వారా చెల్లించడం చర్చనీయాంశమవుతోంది.