ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రభుత్వం నుంచి స్పందన లేదు... అందుకే దీక్ష చేయబోతున్నాం'

నివర్ తుపాన్ వల్ల నష్టపోయిన రైతులకు తక్షణ సహాయంగా రాష్ట్ర ప్రభుత్వం పది వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... రాష్ట్ర వ్యాప్తంగా జనసేన ఆధ్వర్యంలో నిరసన దీక్షలు జరగనున్నాయి. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు జిల్లా కేంద్రాలు. నియోజకవర్గ, మండల స్థాయిలో దీక్ష శిబిరాలు ఏర్పాటు చేసి నిరసన తెలపాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్షను కొనసాగించాలని పేర్కొన్నారు.

Janasena To Protest For Farmers on Monday
Janasena To Protest For Farmers on Monday

By

Published : Dec 6, 2020, 5:37 PM IST

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులను ఆర్థికంగా ఆదుకోవాలన్న తన డిమాండ్​కు ప్రభుత్వం స్పందించకపోవడంపై.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆగ్రహించారు. ప్రత్యక్ష పోరాటంతో ప్రజల్లోకి వెళ్లేందుకు పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ ఇటీవల‌ పర్యటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల 32 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. వరితోపాటు పలు పంటలు దెబ్బ తిని రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని గుర్తించారు. ఈ ఏడాది వరుసగా మూడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించినప్పుడు రైతులు తమ ఆవేదనను వెలిబుచ్చారని... నేలకు పడిపోయిన పంటలు తీసుకోవడానికి కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు రైతులకు ఉన్నాయని పవన్‌ కల్యాణ్‌ అభిప్రాయపడ్డారు.

అందుకే ఎకరాకు రూ.35 వేలు పరిహారం అవసరమని తాము డిమాండ్‌ చేసినట్లు పవన్ చెప్పారు. తక్షణ సాయంగా రూ.10 వేలు ఇస్తే నేల వాలిన పంట తీసుకోవడానికి వెసులుబాటు వస్తుందని కోరుతున్నామని... రైతులు మనోధైర్యం కోల్పోకుండా, ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణ సాయంగా ఆ మొత్తం ఇవ్వాలనేదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వానికి 48 గంటలు సమయం ఇచ్చామన్నారు. అయినా ఎలాంటి స్పందన రాలేదని... అందుకే నిరసన దీక్షకు పిలుపునిచ్చామని తెలిపారు. నష్టపోయిన రైతులకు అండగా నిలిచేందుకే ఈ దీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details