ప్రశ్న: పార్టీ నిర్మాణం అనేది నిరంతర ప్రక్రియ అని గతంలో చాలాసార్లు చెప్పారు. అవసరం మేరకు అందుబాటులో ఉన్న మానవ వనరుల్ని బట్టి, కమిటీల నిర్మాణం చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పారు. రాబోయే కొన్ని నెలల్లో పార్టీని నిర్మించడానికి మీరేమైనా చేయబోతున్నారా..?
జ.ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్లో పార్టీ ప్రారంభించాం. నాకున్న అశేష అభిమాన బలం గానీ, ఓ కొత్త రాజకీయ వ్యవస్థను కోరుకునే తరం గానీ.. 2007లో రాజకీయాల్లో ఉన్నప్పుడు నాకు కనెక్ట్ అయిన వ్యక్తులు గానీ అంతా మేముంటాం అని చెప్పి అండగా నిలిచారు. పార్టీ నిర్మాణం నిరంతర ప్రక్రియ అనడానికి కారణం ఉంది. గతంలో ఒక భావజాలం ఉండేది. దానితో అనుసంధానం అయ్యేవారు. ఇప్పుడు కుల ధోరణులు వచ్చేసి ఓ గ్రూపు అవసరాలకు అన్నట్టు అయిపోయింది. ఉమ్మడిగా మనందరి అవసరాలు ఏంటి అని ఆలోచిస్తే కులాల ప్రసక్తి ఉండదు. సమగ్రమైన ఆలోచనతో రాజకీయ పార్టీ వచ్చినప్పుడు దానికి చాలా బలమైన కన్విక్షన్ కావాలి. అలాంటి వ్యక్తులు రావడానికి సమయం పడుతుంది. ఒక కొత్త తరం నాయకుల్ని తయారు చేస్తున్నాం. అందులో ఒడుదుడుకులు, ఎదురు దెబ్బలు ఉంటాయి. వీటన్నింటినీ తట్టుకుని నిలబడి ప్రజలకు ఎంత బలంగా సేవ చేయాలో అంత బలంగా సేవ చేస్తాం. దానికి తగ్గ కార్యవర్గం అన్నిచోట్లా క్రమంగా సమకూర్చుకుంటున్నాం. దాదాపు 100కు పైగా నియోజకవర్గాల్లో చాలా బలమైన కార్యవర్గం ఉంది. అది అభివృద్దిగానే చూస్తున్నాం.
ప్రశ్న: మోదీ ప్రధాని అయిన తర్వాత ఆర్థికంగా వెనుకబడిన వారికి (ఈ.డబ్యూ.ఎస్.) 10 శాతం రిజర్వేషన్ కేటాయించే విధంగా చట్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల స్థాయిలో అయితే వారికి ఇష్టం వచ్చిన రీతిలో ఆ 10 శాతాన్ని వినియోగించుకోవడానికి అనుమతి కూడా ఇచ్చారు. ఆ సందర్భంగా 5 శాతం రిజర్వేషన్లకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కాపులకు ఇచ్చింది. తర్వాత జగన్ ప్రభుత్వం ఆ రిజర్వేషన్లు రద్దు చేసింది. దీనిపై మీరేం చెబుతారు..?
జ.కేంద్ర ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అవకాశం కల్పించింది. నేను కూడా గత నాలుగైదు సంవత్సరాల్లో క్షేత్ర స్థాయి పర్యటనల్లో పలువురు విద్యార్థులను కలుసుకున్నప్పుడు అందరిలో ఒక బాధ ఏముందంటే ‘మేం పేరుకే అగ్రకులం కానీ మేం తినడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఫీజులు కట్టడానికి ఇబ్బందులు ఉన్నాయి’ అని ఆవేదన చెందేవారు. ఆర్థిక వెసులుబాటు లేదు, కుటుంబానికి ఆధారం లేదు అని బాధపడేవారు. ఇలాంటివన్నీ ప్రతి చోటా చాలా విస్తృతంగా వినిపించేవి. పేరుకే అగ్రకులంగా ఉండి.. ఆర్థిక వెనుకబాటుతనంతో ఉన్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్లు తెచ్చినప్పుడు దేశం మొత్తం హర్షించింది. అమలు చేసుకునే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వడానికి కారణం ఉంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ప్రత్యేకంగా వెనుకబాటుతో ఉంటాయి. అలాంటివి దృష్టిలో పెట్టుకుని ఆ నిర్ణయం మీరు తీసుకోండని అధికారాలు ఇస్తే.. అందులో భాగంగా ఏపీలో అన్ని కులాలకు వర్తింపచేస్తూ ఒక 5 శాతం కాపులకు కేటాయించారు. ఈబీసీ రిజర్వేషన్లను ఈ ప్రభుత్వం తీసేసింది. మీరు రిజర్వేషన్లు ఇవ్వరు.. ఉన్న ఈబీసీ రిజర్వేషన్లు తీసేశారు. ఒక్క కాపులకు మాత్రమే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరికీ ఈబీసీ రిజర్వేషన్లు వర్తింపచేయాలని కోరుకుంటున్నా.
ప్రశ్న: లాక్డౌన్ సందర్భంగా ప్రధాని మోదీ ఆత్మనిర్భర భారత్ అనే ఆలోచనతో రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీనీ వివిధ వర్గాలకు కేటాయించారు. దీని మీద కొన్ని ప్రశంసలు.. అక్కడక్కడ విమర్శలు ఉన్నాయి. దీన్ని మీరెలా చూస్తారు..?
జ.లాక్డౌన్, కరోనా వ్యాప్తి మూలంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు జీవం కల్పించే ప్యాకేజీ... ఆత్మ నిర్భర ప్యాకేజీ. లాక్డౌన్ ఎవరూ ఊహించింది కాదు. ప్రధాని మోదీ ఆర్థిక వ్యవస్థ ఛిద్రం అయిపోతూ ఉంటే రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ విడుదల చేశారు. ప్రజల్లో నా వాటా నాకు వచ్చేయాలనే అలోచన లేదు. కానీ సమస్య ఏమిటంటే.. ప్రత్యర్థి రాజకీయ పక్షాలు అలాంటి ఆలోచన విధానంతో మాట్లాడతాయి. రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే వారి దగ్గర నుంచి చిన్న తరహా వ్యాపారాలు, పరిశ్రమలు నిర్వహించుకొనే వారి వరకు బ్యాంకులకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే వస్తాయి. ప్రొడక్ట్ అమ్మి మార్కెట్ పెంచి దాని వల్ల వచ్చే ఆదాయంతో లబ్ధి పొందుతారు. అప్పులిచ్చే వారు లేని పరిస్థితుల్లో అలాంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు దాన్ని ప్రత్యర్ధి పార్టీల మాదిరి మార్చి మాట్లాడితే ఎలా..? ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీలో లబ్ధి పొందిన వారు నిజంగా ప్రధానికి చేతులెత్తి నమస్కరిస్తారు.
ప్రశ్న: ఈ మధ్య కాలంలో భారత్ - చైనా మధ్య దాదాపు యుద్దం వరకు వచ్చిన సంఘటనలు మనం చూశాం. దీని మీద ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలి చాలా గట్టిగా స్పందించారు. దీని మీద మీరేమంటారు.?
జ. మా నాన్న అస్థికలు త్రివేణి సంగమంలో కలిపేందుకు వెళ్లినప్పుడు ముంబై తాజ్ హోటల్స్పై దాడి జరిగింది. దాదాపు 72 గంటల ఆపరేషన్. అంతకు ముందు ఇంకో సంఘటనలో పార్లమెంటు భవనంపై ఉగ్ర దాడి. బలమైన నాయకత్వం లేదేంటి... దేవాలయం లాంటి పార్లమెంటు మీద దాడి ఏమిటి.. అసలు అక్కడి వరకు ఎలా వచ్చేస్తారు.. అనిపించింది. ఎక్కడో పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ముంబై వచ్చి కాల్చేస్తుంటే ఎదుర్కొనే బలమైన నాయకత్వం లేదా అన్న ఆలోచన కలిగినప్పుడు మోదీ కనిపించారు. ఆయన లాంటి బలమైన నాయకుడు అవసరం అనిపించింది. కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండవు.. కష్టంగా కూడా ఉంటాయి. కానీ దీర్ఘకాల ప్రయోజనాలు చూస్తే అంతా ప్రశంసిస్తారు. 2014 నుంచి నేను అదే ఆలోచనా విధానంతో ఉన్నాను. మొన్న చైనా ఎగ్రెషన్ చూస్తే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్న పాఠం గుర్తుకు వచ్చింది. హిస్టరీ పాఠాల్లో భారత దేశం మీద జరిగిన దండయాత్రలు, భూభాగాలు కోల్పోవడాలు చదివాం. వీరోచితంగా ఎదురు తిరిగిన ఘట్టాలు లేవు. అది మన దౌర్భాగ్యం. అలాంటి ఆవేదన ఉన్న తరం నుంచి వచ్చిన మాలాంటి వాళ్లందరికీ మోదీ రూపంలో బలమైన నాయకత్వం కనిపించింది. మన భూభాగం మీద కన్ను పడే ఆలోచన చేయడానికి కూడా సాహసించే పరిస్థితి ఉండని నాయకత్వం ఉండాలి. ఆ నాయకత్వాన్ని మోదీ చాలా బలంగా చూపించారు. 2014లో గెలిచినప్పుడు ఎందుకు ఈయన చాలా దేశాలకు వెళ్తున్నారు. దేశం పట్టున ఉండడం లేదు అని విమర్శించిన వాళ్లందరికీ సమాధానం ఇచ్చే స్థాయిలో గొప్ప దౌత్యం జరిపారు. ఇన్ని అగ్ర రాజ్యాల మద్దతు కూడగట్టుకుని ఆర్థికంగా.. మిలటరీపరంగా బలమైన చైనా దేశాన్ని... వారి దుందుడుకు తనాన్ని నిలువరించడం పెద్ద విజయంగా భావించవచ్చు.