ప్రశ్న: వైకాపా అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. ఆ ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం ఏంటి..? పాలన ఎలా ఉంది?
జ. 151 సీట్లు సాధించడం ద్వారా చాలా బలమైన స్థిరత్వం ఇచ్చే శక్తి సమర్ధత ఈ పార్టీ పొందింది. అలా కాకుండా వాళ్లకున్న బలాన్ని రాజకీయ కక్షల కోసమో.. కేవలం కొన్ని గ్రూపుల కోసమో.. ఓటు బ్యాంకు కోసమో.. వినియోగించాల్సిన అవసరం లేదు. ఇది వైకాపాకు భగవంతుడు ఇచ్చిన వరం. దాన్ని సద్వినియోగం చేసుకోవడం లేదనే నా అభిప్రాయం. 60 కేసులకు పైగా హైకోర్టులో ఆక్షేపణలు ఎదుర్కోవడం గురించి కూడా పరిశీలన చేసుకోవాలి. తప్పులున్నాయని అర్థం చేసుకోవాలి.
ప్రశ్న: రాష్ట్రంలో అప్పులు ప్రమాదకర రీతిలో ఉన్నాయని క్రెడిట్ రేటింగ్ సంస్థలు లెక్కలు చెబుతున్నాయి. దీన్ని మీరెలా విశ్లేషిస్తారు?
జ. సగటు మనిషికి అర్థం అయ్యేలా చెప్పాలంటే మనం సంపాదించే దాని కంటే అప్పులు ఎక్కువ ఉన్నప్పుడు ప్రశాంతత.. సుఖం ఎక్కడ ఉంటుంది. ఒక రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. గత ప్రభుత్వంలోనూ ఈ అప్పులు ఉన్నాయి. వీళ్లు ఇంకా ఎక్కువ చేసేశారు. అలా జరగకుండా చూసుకోవాలి. ఆదాయం పెంచే మార్గాలు వెతకాలి తప్ప అప్పులు పెంచే మార్గాలు వెతికి దాన్ని అబివృద్ధి అంటే మనం ఏమీ చేయలేం. అప్పులు తీసుకువచ్చి ప్రజలకు ఇచ్చే పరిస్థితి ఉంటే దీన్ని అభివృద్ధి అనం. తిరోగమనం అనొచ్చు. మిగిలిన నాలుగేళ్లలోనయినా వైకాపా నాయకులు కళ్లు తెరిచి అభివృద్ధి వైపు వెళ్లాలి. రాజకీయ నాయకులు డబ్బు సంపాదించడం కోసం భవిష్యత్ తరాల జీవితాన్ని ఫణంగా పెడుతున్నారు. విద్య, వైద్య వ్యవస్థలు సరిగా ఉండవు. ఉపాధి అవకాశాలు సరిగా రావు. అందువల్లే మనం ఎప్పుడూ అణగారిపోయి ఉంటాం. మనల్ని నడిపే రాజకీయ వ్యవస్థ మాత్రం చాలా బాగుంటుంది.
ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 62 కేసుల్లో హైకోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చాయి..?
జ. పోలీసులు, రెవెన్యూ వ్యవస్థ ఇవన్నీ సమాంతర వ్యవస్థలు, వీరంతా ప్రభుత్వాన్ని ఏ పార్టీ నడిపిస్తుంటే వాళ్లలాగే ప్రవర్తిస్తుంటే దాన్ని కోర్టులు చూస్తూ ఎలా ఊరుకుంటాయి. కోర్టులకు ఇండివిడ్యువాలిటీ ఉంది కాబట్టి ప్రజలకు కష్టం నష్టం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది. ప్రభుత్వం తన విధానాలు సరి చేసుకోకపోతే మాత్రం చాలా బలమైన ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ప్రజలు ఎదురు తిరగట్లేదు, మాట్లాడటం లేదు అనుకుంటే అది పొరపాటే. బ్లాక్ లైవ్స్ మేటర్ అనేది అమెరికాలో జరిగిన ప్రొటెస్ట్ అగ్రరాజ్యాన్ని కుదిపేసింది. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి గాని కొమ్ము కాస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో అగ్రరాజ్యం అయిన అమెరికాలోనే చూశాం. రాష్ట్ర చరిత్రలో డీజీపీ ఇన్నిసార్లు హైకోర్టుకు వెళ్లడం ఎప్పుడూ జరగలేదు. ఈ పరిస్థితి వచ్చింది అంటే.. రాజకీయ వ్యవస్థ చేసే తప్పులకు ఆయన బలైపోతున్నారు. డాక్టర్లపై కేసులు పెట్టడం, రోడ్ల మీదకు వచ్చి మాట్లాడేసి.. మనకి ఉన్న బలంతో వీటన్నింటినీ సర్దుకుపోవచ్చు గానీ అది క్షేమకరం కాదు.
ప్రశ్న: విద్య, వైద్య రంగాలపై కరోనా ప్రభావం బాగా పడింది. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ఇప్పటికే ఆన్లైన్ తరగతులు ప్రారంభించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత వరకు ఏ కార్యక్రమం ప్రారంభం కాలేదు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి?
జ. దీనిలో రెండు రకాల సమస్యలు ఉన్నాయి. ఆర్థికంగా బలం ఉన్న స్కూల్స్ అన్లైన్ క్లాసులు నడుపుతున్నాయి. దాని నుంచి ఉత్పన్నమయ్యే సమస్యలు వేరు. ప్రభుత్వ పాఠశాలల విషయానికి వస్తే ఆన్లైన్ క్లాసులు నడిపే వ్యవస్థ లేదు. ఒక విద్యా సంవత్సరం పోతుంది అని నాకు అనిపిస్తుంది. ఇది ఎవ్వరూ ఊహించని పరిణామం. దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ప్రణాళికే లేదనిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో విద్యా సంవత్సరం పరిస్థితి ఏమిటి, ఏం చేయాలని ఆలోచన చేసి ఉండాల్సింది. విద్యార్ధులకు ఒక విద్యా సంవత్సరం పోతుందా? లేదా అనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. ఆన్లైన్ క్లాసులు నడిపే ప్రైవేటు స్కూళ్లలో కూడా అంతసేపు పిల్లలు కంప్యూటర్లు చూడలేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. స్కూల్స్ తెరిచినపుడు ప్రైవేటు స్కూల్స్‌కు బస్సులు అని, మెయింటెనెన్స్ అని ఖర్చులు ఉండేవి. ఇప్పుడు ఏ ఖర్చు లేకుండా అంతంత ఫీజులు ఎందుకు తీసుకుంటున్నారన్న ఫిర్యాదులు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నా.