అమరావతి రైతుల త్యాగాలు వృథాకానీయబోమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. రాజధాని కోసం 34 వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రైతులకు బాసటగా నిలుస్తామని పునరుద్ఘాటించారు. రాజధాని అమరావతి మార్పుపై ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం రైతులను అవమానించడమేనని పవన్ అన్నారు. రాజధానిని 3 ముక్కలు చేస్తేనే అభివృద్ధి వికేంద్రీకరణ కాదని పేర్కొన్నారు. రాజధానిని పరిరక్షించుకొనేందుకు 200 రోజులుగా రైతులు, రైతు కూలీలు, మహిళలు అలుపెరగని పోరాటం చేస్తున్నారని.... వారికి జనసేన సంఘీభావం తెలుపుతుందన్నారు.
ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని... తర్వాత వచ్చే పాలకులు అమలు చేస్తూ మరింత పురోగతికి ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రైతులు భూములు ఇచ్చింది ప్రభుత్వానికే కానీ.. ఒక వ్యక్తికో, పార్టీకో కాదన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్న... పవన్ కల్యాణ్... రాజధానిని తరలింపు నిర్ణయం సరికాదని అన్నారు.