Janasena On PRC: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతనాలు, పింఛన్లపై సీఎస్ చెబుతున్న లెక్కలు నమ్మశక్యంగా లేవని జనసేన పార్టీ ఆరోపించింది. ఉద్యోగులతో పాటు యావత్ రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించేలా అంకెల గారడీ చేశారని దుయ్యబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో 111% మేర జీతాలు, పెన్షన్లకే వెళ్లిపోతుంది అంటే ఎవరైనా నమ్ముతారా? అని సందేహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఎందుకు ఈ విషయం ప్రస్తావించలేదని నిలదీసింది. ఇదే నిజమైతే ఆ విషయాన్ని శాసనసభలో ఎందుకు చెప్పలేదని... అసెంబ్లీలో లెక్కలు పక్కాగా చెప్పాల్సి ఉంటుందని పేర్కొంది.
Nadendla Manohar on PRC:తప్పుడు లెక్కలతో ఎవర్ని మోసపుచ్చడానికి నివేదిక తయారు చేయించారని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నిలదీశారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజలకు దూరం పెంచేందుకే ఇలాంటి నివేదికలు ప్రకటిస్తున్నారని ధ్వజమెత్తారు. నెలకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు అవుతున్న వ్యయం రూ.4,600 కోట్లు మేరకే ఉంటుందని ఉద్యోగ సంఘాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాయని... ఆ విషయం నిజం కాకపోతే అప్పుడే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఏటా రూ.67వేల కోట్ల ఖర్చవుతోందని ఎందుకు ప్రకటించలేదన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక నియమించిన వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది జీతాలను కేంద్రం ఇచ్చే నిధుల నుంచే మళ్లిస్తున్నారన్నారు. ఇక ఏ దశలో రాష్ట్ర ఖజానాకు భారంపడుతుందో పారదర్శకంగా చెప్పాలని డిమాండ్ చేశారు.