విశాఖ ఉక్కు కార్మికుల పరిరక్షణకు సంఘీభావంగా... ఈనెల 12న జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నిరాహారదీక్ష చేయనున్నారు. ఉక్కు కర్మాగారం పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేదని పవన్ విమర్శించారు. అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకువెళ్లాలని విశాఖ సభలో అల్టిమేటం ఇచ్చినా.. ప్రభుత్వం స్పందించలేదని అన్నారు. ఈ అంశంపై తమ పార్టీ తరఫున పోరాటం కొనసాగుతుందన్న జనసేనాని.. రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల నేతలను దిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
కార్మికులు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు 300 రోజులుగా నిరవధికంగా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారని, వారికి నైతిక మద్దతు కొనసాగింపులో భాగంగా.. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈ నిరాహార దీక్ష జరుగుతుందని జనసేన పార్టీ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
విశాఖ సభలో పవన్...
Pawan Kalyan Protest : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇటీవల జనసేన తలపెట్టిన సభలో.. అధికార పార్టీ వైకాపాపై పవన్ నిప్పులు చెరిగారు. దేశ ప్రగతికి ఉక్కు కర్మాగారాలు చాలా ముఖ్యమన్న జనసేన అధినేత.. ఆంధ్రుల హక్కును ప్రైవేటు పరం చేస్తుంటే వైకాపా ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. టీ, కాఫీలు తాగడానికే పార్లమెంట్ కు వెళ్తున్నారా? అని నిలదీశారు. విశాఖ ఉక్కు కార్మగారం ఎవరి భిక్షవల్లో రాలేదని.. అది ఆత్మబలిదానాలతో సాధించుకున్న పరిశ్రమ అని పవన్ అన్నారు. 'విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు' నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి ఆయన మద్దతు ప్రకటించారు.