రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోగా.. ప్రజల ఖాతాల్లో ఎంత నగదు జమ చేశారో చెప్పడానికి పుస్తకాలు పంపిణీ చేశారని, తద్వారా ప్రజాధనాన్ని వృథా చేశారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఒక్కో పుస్తకానికి రూ.300 వెచ్చించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ పుస్తకాలను పంపిణీ చేయడానికి వాలంటీర్లను వినియోగించడం దుర్మార్గం అని ఆక్షేపించారు. అదే రీతిలో ఇసుక, మద్యం, దోపిడీ, భూకబ్జాలు, రోడ్ల మరమ్మతులు, రైతుల కోసం ఏం చేశారు..? అనే విషయాలను ప్రస్తావిస్తూ పుస్తకరూపంలో ప్రచురించి ప్రజలకు పంపిణీ చేయాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.
ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు..
గుంటూరు జిల్లా తెనాలిలోని పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ సమావేశం ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరంలో పాలకులు అంకిత భావంతో ప్రజల కోసం పనిచేయాలని ఆకాంక్షించారు. కేంద్రం ఇచ్చిన 14, 15వ ఆర్థిక సంఘం నిధులనూ ప్రభుత్వం లాక్కొని ఆర్థిక సంక్షోభం సృష్టించిందని, సర్పంచ్లకు చెక్ పవర్ తీసేసి అభివృద్ధి నిరోధకాలుగా ప్రభుత్వం మారిందని విమర్శించారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ జరిగితేనే ప్రజలకు మేలు జరుగుతుందని సూచించారు. మరోపక్క ఉద్యోగాలు లేక యువత వేరే రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి తలెత్తిందని నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ఖాతాల్లో ఎంత నగదు జమ చేశారనేది పుస్తకం పంపిణీ చేశారు. ఒక్కో పుస్తకానికి రూ.300 వెచ్చించి ప్రభుత్వ ధనాన్ని వృథా చేశారు. ఇసుక, మద్యం విక్రయాలనూ ప్రచురించి పంపిణీ చేయాలి. ఉద్యోగాలు లేక యువత వేరే రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు. - నాదెండ్ల మనోహర్, జనసేన నేత