విశాఖ ఉక్కును కేవలం కర్మాగారంగానే చూడొద్దని.. ఆంధ్రుల మనోభావలకు ప్రతీకగా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. రెండు రోజులుగా దిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కేంద్రమంత్రులు మురళిధరన్, కిషన్ రెడ్డిలను కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని పునఃపరిశీలించాలని విన్నవించారు.
ప్రజలను మభ్యపెట్టడానికే జగన్ లేఖ:
పవన్ వెంట దిల్లీ పర్యటన జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. విశాఖ ఉక్కు అంశంలో కొరియా కంపెనీతో ఒప్పందం గతేడాదే జరిగితే.. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు లేఖ ఎందుకు రాసిందని పవన్ ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టేందుకు వైకాపా ప్రభుత్వం లేఖ రాసి చేతులు దులుపుకొంటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఆలయాలపై దాడుల అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు.