నోటికొచ్చిన అబద్ధాలు చెప్పడమే సీబీఐ దత్తపుత్రుడైన సీఎం జగన్‌కు తెలిసిన విద్య అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. గడప గడపలో వైకాపా ఎమ్మెల్యేలు ప్రజల చేత ఛీత్కారాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసి.. పరిపాలన చేతగాని జగన్‌లో ఆందోళన మొదలైందని ఓ ప్రకటనలో విమర్శించారు.
వారిని ఎందుకు దూరం పెట్టారు..: ‘‘పాదయాత్రలో ముద్దులు పెడుతూ నోటికొచ్చిన హామీలు గుప్పించారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటి గురించి అడిగితే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. ఇప్పుడేమో 95 శాతం హామీలు నెరవేర్చాను అని మరో పెద్ద అబద్ధం చెప్పారు. రాష్ట్రంలో మత్స్యకార భరోసాకు అర్హత ఉన్న కుటుంబాల్ని పథకానికి ఎందుకు దూరం చేశారో చెప్పాలి. 2021లో లక్షా 19వేల మందికి ఇస్తున్నామని చెప్పి.. 2022లో ఆ సంఖ్య లక్షా 8 వేలకు తగ్గించిన మాట వాస్తవం కాదా? జీవో 217 ద్వారా మత్స్యకారులను చేపల చెరువులకు ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలి.
ఆ పేరు పలికే అర్హత ఉందా.. : మహాదాత మల్లాడి సత్యలింగం పేరు పలికే అర్హత సీబీఐ దత్తపుత్రుడికి ఉందా? ఆయన దానం చేసిన ఆస్తులను, భూములను వైకాపా వాళ్లు కబ్జాలు చేస్తున్న విషయం జగన్ రెడ్డికి తెలియదా? వైకాపా మేనిఫెస్టోలో చెప్పిన మద్య నిషేధం ఎక్కడ అమలవుతుందో చెప్పాలి. ఏటా జనవరి 1న జాబ్ క్యాలెండర్ అని నిరుద్యోగ యువతను మభ్యపెట్టారు. ఈ మూడేళ్లలో ఇచ్చింది ఒక క్యాలెండర్... అదీ అరకొర ఉద్యోగాలు. ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ రద్దు చేసి పాత పింఛను విధానం తీసుకొస్తామని మాట తప్పారు. అవగాహన లేక ఆ హామీ ఇచ్చామని సకల శాఖల మంత్రితో చెప్పించి మోసం చేసిన విషయాన్ని ఒప్పుకొన్నారు. ఆత్మహత్య చేసుకొన్న రైతులు, కౌలు రైతుల కుటుంబాలకు రూ.7 లక్షలు ఇస్తామని చెప్పి.. వాటిని ఎగ్గొట్టే పనిలో ఉన్నారు.
సమాధానం చెప్పుకోలేని స్థితికి జగన్.. వైకాపా దారుణ పాలన చూసే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఉన్న పరిశ్రమలు కూడా మూసేసుకొని పారిశ్రామికవేత్తలు పొరుగు రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. విద్యుత్ సంక్షోభం, రోడ్ల దుస్థితి కళ్లెదుట కనిపిస్తున్నాయి. ఈ విషయాల గురించి ప్రజలు నిలదీస్తుంటే జగన్ రెడ్డి సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. మరో వైపు ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తుంటే వైకాపా నేతల్లో ఆందోళన మొదలైంది’’ అని నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఇదీ చదవండి:'ఆఫ్ బడ్జెట్ అప్పులపై.. ఆ వివరాలివ్వండి'