కరోనాతో పాటు సినిమా చిత్రీకరణల కారణంగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్... రెండు రోజుల పాటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. జనసేన రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం, బుధవారం కీలక సమావేశాలు జరగనున్నాయి. మంగళవారం ఉదయం జరిగే సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు పురోగతిపై సమీక్ష జరగనుంది.
ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు రూరల్, అనంతపురం నియోజకవర్గాలలో క్రియాశీలక సభ్యత్వ నమోదు విజయవంతంగా పూర్తయింది. ఈ 5 నియోజకవర్గాల్లో అనుసరించిన తీరుని పరిశీలించి... మిగతా ప్రాంతాల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై పవన్ సమీక్షించనున్నారు. అలాగే క్రియాశీలక సభ్యులకు పార్టీ తరపున అందిస్తున్న బీమా సౌకర్యానికి సంబంధించి ధ్రువపత్రాలను ప్రదానం చేస్తారు.
మంగళవారం మధ్యాహ్నం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల ముఖ్యనేతలతో పవన్ సమావేశం కానున్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి, ప్రజాసమస్యలపై చేయాల్సిన పోరాటాలపై చర్చించనున్నారు. 18వ తేదీ ఉదయం పది గంటలకు అమరావతి పరిరక్షణ సమితి నేతలు, రాజధాని ప్రాంత రైతులు, మహిళలతో భేటీ అవుతారు. రాజధాని అమరావతిలో ఉండాలనే అంశంపై పార్టీ గతంలోనే స్పష్టమైన తీర్మానం చేసింది.