అమరావతి ఉద్యమం 60వ రోజుకు చేరుకున్న వేళ... జనసేనాని పవన్ కల్యాణ్ రెండోసారి రాజధాని గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఎర్రబాలెం నుంచి ప్రారంభమైన పర్యటన... కృష్ణాయపాలెం, రాయపూడి, అనంతవరం, తుళ్లూరు, వెలగపూడి, మందడం గ్రామాల్లో నిర్విరామంగా కొనసాగింది. వేలాది మంది రైతులు పవన్ సభకు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ రాజధానిపై మాట మార్చారని విమర్శించారు. అధికార వికేంద్రీకరణ అంటూ జగన్ అప్పుడు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఆయనేమైనా ఇప్పుడే కళ్లు తెరిచిన పసిపాపా అంటూ ఎద్దేవా చేశారు.
ఐదు కోట్ల ఆంధ్రుల కోసం..
రాజధాని రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చింది తమ బిడ్డల భవిష్యత్తు కోసం కాదని.. ఐదు కోట్ల ఆంధ్రుల కోసమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. రాజధాని తరలింపు అంశాన్ని రియల్ ఎస్టేట్ క్రీడలా మార్చారని.... వివాదానికి చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తాను ఓట్ల కోసం రాలేదని, ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఉన్నారో లేదో తెలియదని చెప్పారు. అమరావతి ఉద్యమంలో రైతులు, మహిళలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
కేంద్ర సమ్మతి లేదు
మూడు రాజధానుల అంశం సమ్మతం కాదంటూ కేంద్ర పెద్దలు తనకు స్పష్టత ఇచ్చినట్లు పవన్ వెల్లడించారు. పొత్తు పెట్టుకునేటప్పుడు ఎన్ని సీట్లంటూ అడగలేదని... అమరావతిపై మాత్రం వారి స్పష్టత కోరినట్లు చెప్పారు. అమరావతికే కట్టుబడి ఉన్నట్లు కేంద్ర పెద్దలు చెప్పారని... పార్టీపరంగా పొత్తులో భాగంగా దీనిపై ఒప్పందాన్ని రాసుకున్నామని పవన్ తెలిపారు. అమరావతి కోసం వేల కోట్లు ఖర్చు చేశాక.. ఇప్పుడు వైకాపా మూడు రాజధానులని చెబితే ఎలా అని ప్రశ్నించారు.