Janasena protests on Bad Roads: రోడ్ల దుస్థితిని తెలియజేసేందుకు.. జనసేన పార్టీ చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్.. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. విజయవాడలో ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్.. రోడ్లపై ఏర్పడిన గోతుల్లో మొక్కలు నాటి.. నిరసన తెలిపారు. రోడ్ల బాగుచేసే విషయంలో.. స్థానిక ఎమ్మెల్యే ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రహదారుల అధ్వాన పరిస్థితిపై.. గుంటూరులో జనసేన పార్టీ ఆందోళన నిర్వహించింది.
పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పిలుపు మేరకు శ్రీనగర్ కాలనీలో పాడైపోయిన రహదారిపై నిరసన తెలిపారు. రోడ్లను ఫొటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జనసేన నాయకులు.. డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. జూలై 15 వరకు రోడ్లన్నీ బాగు చేస్తామని చెప్పి.. సీఎం మాట తప్పారని ఆరోపించారు. తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు పూడ్చేందుకు కొద్దిగా మట్టి కూడా వేయలేదని.. జనసేన పార్టీ నాయకులు ఆరోపించారు. 'గుడ్ మార్నింగ్ సీఎం' పేరుతో గుంటూరులోని దుగ్గిరాల మండలం పెదపాలెం- వీర్లపాలెం గ్రామల్లోని రహదారి వద్ద జనసేన నాయకులు నిరసన తెలిపారు. సొంత నిధులతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రచారం చేసుకుంటున్న స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వీర్లపాలెం రహదారిని ఎందుకు మర్చిపోయారని నిలదీశారు. ప్రచారానికి నిర్వహించే డబ్బులను రహదారుల మరమ్మతులకు వినియోగించాలన్నారు. మంగళగిరి నియోజకవర్గ అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే అది జనసేన వల్లే సాధ్యమవుతుందని .. జనసేన చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షులు చిల్లపల్లి శ్రీనివాస్ నిలదీశారు.