నివర్ తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం పెంచడం సహా తక్షణ సాయంగా రూ.పదివేలు ఇవ్వాలన్న డిమాండ్‌తో జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపట్టింది. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు జనసైనికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాధిత రైతులతో కలసి కలెక్టరేట్లకు వెళ్లిన జనసైనికులు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చారు.
కృష్ణా జిల్లాలో జరిగిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెనమలూరు, గుడివాడ, పెడన నియోజకవర్గాల మీదుగా సాగిన ర్యాలీ మచిలీపట్నానికి చేరుకుంది. దారి వెంట పవన్ కళ్యాణ్‌కు అభిమానులు, కార్యకర్తలు, రైతులు నీరాజనాలు పట్టారు. పలుచోట్ల మహిళలు హారతులు పట్టి ఆశీర్వదించారు. దారి వెంట పలుచోట్ల ఆగిన పవన్ .. తుపాను వల్ల నష్టపోయిన పంటలు పరిశీలించారు. పరిహారం అందక రైతులు పడుతోన్న కష్టాలను తెలుసుకున్నారు. విజయవాడ - గుడివాడ రహదారి అధ్వానంగా మారిందని, కనీస మరమ్మతులు చేయకపోవడం వల్ల కష్టాలు పడుతున్నట్లు పలువురు వాహనదారులు పవన్ దృష్టికి తెచ్చారు. గుడివాడ నగరానికి చేరుకున్న పవన్.. నెహ్రూ చౌక్ కూడలిలో బహిరంగ సభలో రైతులు, వాహనదారులు తన దృష్టికి తెచ్చిన అంశాలను వెల్లడించారు. స్థానిక మంత్రి కొడాలి నానిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైకాపా ప్రజాప్రతినిధులకు పేకాట క్లబ్బులు నిర్వహించడంలో ఉన్న సమర్థత ప్రజా పాలనను ముందుకు తీసుకెళ్లడంలో లేదని మండిపడ్డారు.
రాజకీయం చేస్తున్నారు....
పెడన, మచిలీపట్నం నియోజకవర్గాల మీదుగా పవన్ ర్యాలీ కొనసాగింది. దారి వెంట పలువురు రైతులు తమ గోడును పవన్‌కు వెళ్లబోసుకున్నారు. మచిలీపట్నంలో రైతులను పరామర్శించిన పవన్... వారికి మద్దతుగా పాదయాత్ర చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తోన్న తీరుపై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్ర ఖజానాకు 40 శాతం ఆదాయం తెస్తోన్న రైతన్నలకు కష్టాలు వస్తే వాటిని తీర్చడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని పవన్ దుయ్యబట్టారు. సమస్యల పరిష్కరించాలని తాను రోడ్డుపైకి వస్తే వైకాపా నేతలు రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.