Pawan on Sirivennela: కవి తన రచనల ద్వారా అమరత్వం పొందుతాడని... సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికంగా లేకపోయినా ఆయన సమాజానికి అందించిన అక్షర కిరణాల ద్వారా స్ఫూర్తినిస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. పంచ భూతాల్లో కలసిపోయినా... రాబోయే తరానికి దిశానిర్దేశం చేస్తూనే ఉంటారని పేర్కొన్నారు. 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఒక గొప్ప కవి అని కొనియాడారు.
సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం:సిరివెన్నెల జయంతి సందర్భంగా విడుదలైన 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి సమగ్ర సాహిత్యం' మొదటి సంపుటిని చూశాక... ఆ అక్షర తపస్విని మొదటిసారి 'రుద్రవీణ' సినిమా సమయంలో కలిసిన సందర్భం గుర్తుకు వచ్చిందని పవన్ అన్నారు. చిరంజీవి నటించిన, నాగబాబు నిర్మాతగా ఉన్న ఈ చిత్రానికి తాను సహ నిర్మాతగా ఉంటూ నిర్మాణంలో పాలుపంచుకున్నానని గుర్తుచేశారు. ఆ సందర్భంలో సిరివెన్నెలతో భేటీ అయ్యేవారిమని తెలిపారు.
ఆ చరణం నన్ను వెంటాడుతూనే ఉంటుంది: 'రుద్రవీణ' చిత్రంలో 'చుట్టూపక్కల చూడరా చిన్నవాడా' పాటలో చివరి చరణం... ఇప్పటికీ తనను వెంటాడుతూనే ఉంటుందన్నారు. "నువ్వుతినే ప్రతి ఒక మెతుకు ఈ సంఘం పండించింది... గర్వించే ఈ నీ బతుకు ఈ సమాజమే మలిచింది... ఋణం తీర్చు తరుణం వస్తే తప్పించుకుపోతున్నావా... తెప్ప తగలబెట్టేస్తావా ఏరు దాటగానే" అనే ఈ పంక్తులు తననెంతో ప్రభావితం చేశాయని పవన్ తెలిపారు. ఇప్పటికీ తన బాధ్యతను గుర్తు చేస్తూనే ఉంటాయని వ్యాఖ్యానించారు. తనను నిలబెట్టిన ఈ సమాజానికి రుణం తీర్చుకోవడం తన విధిగా భావిస్తానని వివరించారు.