Pawan on Railway projects: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు ఎందుకు జాప్యం అవుతున్నాయో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఇచ్చిన వివరణతో... ఇక్కడి వైకాపా ప్రభుత్వ వైఖరి అందరికీ తేటతెల్లమైందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అన్నారు. అభివృద్ధిలో భాగమైన రైల్వే లైన్ల నిర్మాణం, విస్తరణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం చిత్తశుద్ధి లేదని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పూర్తి కావల్సిన ప్రాజెక్టులు... రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం వల్లే జాప్యం అవుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా సమకూర్చాల్సిన నిధులను విడుదల చేయకపోతే పనులు ఎలా సాగుతాయని ప్రశ్నించారు. కీలకమైన రైల్వే లైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయని తెలిపారు.
ప్రభుత్వానికి శ్రద్ధ లేదు...
కోటిపల్లి–నరసాపురం రైల్వే లైన్ అనేది ఎప్పటినుంచో వింటున్నదేనని... ఈ ప్రాజెక్టుకు 25 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని అన్నారు. ఆ మొత్తం ఇవ్వకపోవడంతో పనులు ముందుకు వెళ్లడంలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూ. 358 కోట్లు ఇస్తే పనులు మొదలవుతాయన్నారు. ఈ రైల్వే లైను పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం ఉంటుందని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదని విమర్శించారు. అలాగే నడికుడి – శ్రీకాళహస్తి ప్రాజెక్టుకు రూ. 1351 కోట్లు, కడప – బెంగళూరు లైనుకు రూ. 289 కోట్లు, రాయదుర్గం – తుముకూరు లైనుకు రూ. 34 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలని కోరారు.