Pawan kalyan: కోనసీమ ప్రాంతానికి అంబేడ్కర్ పేరు పెట్టారని.. అదేదో జిల్లాలకు కొత్త పేర్లు పెట్టినప్పుడే పెడితే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ అన్నారు. మిగతా జిల్లాలతో పాటు అంబేడ్కర్ పెడితే సహజంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్ పేరు పెట్టడంలో జాప్యమెందుకో అర్థం కావట్లేదని... రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములును ఒక జిల్లాకే కుదించారని చెప్పారు. కృష్ణా నది తక్కువగా ఉన్నచోట కృష్ణా జిల్లా పెట్టారని.. ఎక్కువగా ఉన్నచోట ఎన్టీఆర్ అని పేరు పెట్టారని అన్నారు. జిల్లా పేర్లకు వ్యతిరేకమైనా.. వ్యక్తులకు వ్యతిరేకం కాదని వ్యాఖ్యానించారు. పేర్లు పెట్టేటప్పుడు ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. అభ్యంతరాలుంటే 30 రోజులు సమయమిచ్చి కలెక్టరేట్‌కు రమ్మని చెప్పిన ప్రభుత్వం... మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చిందని ప్రశ్నించారు. సామూహికంగా కాదు.. వ్యక్తులుగా రావాలని చెప్పారని.. అది వ్యక్తులను టార్గెట్ చేయడమేనని జనసేన భావిస్తోందన్నారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా? అని పవన్ ప్రశ్నించారు.
దాడి జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు: మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా? అని.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలని పవన్ నిలదీశారు. ఘోరాలను ఆపకుండా జరిగేలా చేస్తారా? ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపెచ్చు జనసేనపై ఆరోపణలు చేస్తారా? అని మండిపడ్డారు. కులసమీకరణపై రాజకీయాలు చేస్తారా? ధ్వజమెత్తారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలతో ఎస్సీల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత నుంచి బయట పడేందుకే గొడవలు రేపారని దుయ్యబట్టారు.
ప్రభుత్వానిదే బాధ్యత: కులాల మధ్య ఘర్షణ రావణకాష్ఠం లాంటిదని.. కులాల గొడవలు జరిగితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదని పవన్ స్పష్టం చేశారు. ఈ ఘటనకు వైకాపా ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాన్ని అడగాలని సూచించారు. ఇలాంటి వారి ఉచ్చులో పడవద్దని మనవి చేస్తున్నానన్నారు. వైకాపా నేతలు గొడవలు తగ్గించే ప్రయత్నం చేయాలని కోరారు. సజ్జల వంటి పెద్దల అనుభవం కులాల మధ్య గొడవలకు కారణం కాకూడదని హితవు పలికారు.
కోడి కత్తి కేసు ఎంతవరకొచ్చింది: కోడి కత్తి ఘటన విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. కోడి కత్తి కేసు సమయంలో ఏపీ పోలీసులను నమ్మేది లేదని చెప్పి హైదరాబాద్ వెళ్లారన్నారు. వైఎస్ వివేకా హత్య విషయంలో వాస్తవాలేంటని నిలదీశారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ తమ చేతిలో ఉంటే ఎందుకు విచారించట్లేదని నిలదీశారు. తమపై హత్యాయత్నంతో సానుభూతి సంపాదించి ఎన్నికల్లో గెలిచారని అన్నారు. రాందాస్ అథవాలే ఏపీలో అత్యధికంగా 557 అట్రాసిటీ కేసులు ఉన్నాయని చెప్పారని పవన్ తెలిపారు.