జనసేన పార్టీ.. నిరుద్యోగ యువత పక్షాన నిలుస్తుందని, గొంతు నొక్కాలనుకుంటే ఉపేక్షించబోమని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అర్ధరాత్రి అరెస్టులు... నిర్బంధాలతో జనసేన నాయకులు, శ్రేణులను నిలువరించలేరన్నారు. ఎంతగా కట్టడి చేయాలని చూసినా నిరుద్యోగుల కోసం వినతి పత్రాలు అందించగలిగారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు, జన సైనికులకు పవన్ కల్యాణ్ అభినందనలు తెలిపారు.
అక్రమంగా అరెస్టులు చేసి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికమని పవన్ అన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లోని ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజ్ కార్యాలయాలకు వెళ్ళి వినతి పత్రాలు అందించే కార్యక్రమం చేపడితే అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి నుంచే పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్ళి పార్టీ కార్యక్రమానికి వెళ్లకూడదని ఆంక్షలు విధించారన్నారు. అర్థరాత్రి నుంచి గృహ నిర్బంధాలు, అరెస్టులు చేసి పార్టీ శ్రేణులను భయపెట్టే ప్రయత్నం చేశారని ఆక్షేపించారు.