ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ, నిరసన తెలియజేయడం ప్రతి ఒక్కరి హక్కు అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటి హక్కును రాష్ట్రంలో సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం హరించి వేయడం ప్రజాస్వామ్యానికే విఘాతమన్నారు.
పోలీసులు ఎంత బలప్రయోగం చేసి, ఎన్ని అడ్డంకులు సృష్టించినా రామతీర్థం కొండ దగ్గరకు చేరుకొని ప్రజా నిరసనను తెలియచేసిన వారికి పవన్ అభినందనలు తెలిపారు. జనసేన, భాజపా తలపెట్టిన రామతీర్థ ధర్మ యాత్రను పోలీసులను ఉపయోగించి అడ్డుకోవడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసిందని ఆక్షేపించారు. జనసేన నాయకులు, కార్యకర్తలను పోలీసులు బెదిరించడం, హెచ్చరికలు పంపడం చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎందుకంత భయపడుతుందో సామాన్యులకు అర్థం కాకుండా ఉండదన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వారినే కాకుండా కోస్తా, రాయలసీమ జిల్లాల్లో కూడా జనసేన నాయకులు, కార్యకర్తలను గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామికమని విమర్శించారు.