హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. పాకిస్థాన్ దేశంలోనే ఆలయాల ధ్వంసం గురించి చదువుతున్నామని...అలాంటిది మన రాష్ట్రంలో దేవతా విగ్రహాల ధ్వంసాన్ని చూస్తున్నామని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దేవుడి విగ్రహం ధ్వంసంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారన్నారు. ఈ పరిస్థితి నెలకొనడం అత్యంత దురదృష్టకరమని హిందూ ధర్మాన్ని విశ్వసించేవారి మనోభావాలను దెబ్బ తీసే ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకోవటం ఆవేదనకు గురి చేసిందన్నారు.
మత మౌఢ్యం పెచ్చరిల్లుతోంది..
రామా నామాన్ని జపించే పవిత్ర భూమి మనదని.. దేశంలో రామాలయం లేని ఊరంటూ లేదని పవన్ అన్నారు. రాష్ట్రంలో ఆ భావనలు చెరిపేయాలనుకొంటున్నారా? అని ప్రశ్నించారు. భద్రాచలం తరహాలో అధికారికంగా శ్రీరామనవమి చేయాలనుకొన్న రామతీర్థం క్షేత్రంలో కొద్ది రోజుల కిందటే కోదండ రాముడి విగ్రహం తలను నరికి పడేసే మత మౌఢ్యం పెచ్చరిల్లడం ఆందోళనకరంగా ఉందన్నారు. ఒక పథకం ప్రకారమే ఈ దుశ్చర్యలకు తెగబడుతున్నట్లు అని అనుమానాన్ని వ్యక్తం చేశారు.