ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే.. జరగబోయేది అదే : పవన్ - ఏపీ తాజా వార్తలు

Pawan Kalyan: రాష్ట్రంలో మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే తీరని నష్టమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఒట్లు చీలకూడదనే పొత్తుల బాటన్న ఆయన... భాజపా, జనసేన కూటమి ఉమ్మడి సీఎం అభ్యర్థిగా తానుంటాననేది కేవలం ప్రచారమేనన్నారు. కోనసీమ అల్లర్ల వెనక ప్రభుత్వ పాత్ర ఉందని జనసేన పవన్‌కల్యాణ్‌ ఆరోపించారు. జిన్నా పేరు విభజనతో ముడిపడి ఉందన్న పవన్​...స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ముస్లిం నేతల్లో ఎవరో ఒకరిపేరు జిన్నాటవర్‌ సెంటర్‌కు పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Pawan Kalyan
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

By

Published : Jun 4, 2022, 7:01 AM IST

Pawan Kalyan: భాజపా, జనసేన మధ్య సమన్వయం లేదనుకోనవసరం లేదని జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అన్నారు. నాయకులం అంతర్గతంగా మాట్లాడుకుంటూనే ఉన్నామని స్పష్టం చేశారు. భాజపా నుంచి జనసేన ఎలాంటి రోడ్డు మ్యాప్‌ తీసుకోలేదన్నారు. తాము కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్న తర్వాత వాస్తవ పరిస్థితుల ఆధారంగా ఎలా ముందుకు వెళ్లాలో చర్చలు జరుగుతాయని పేర్కొన్నారు. మంగళగిరిలో శుక్రవారం ఆయన విలేకరులతో ముచ్చటించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆయన వెంట ఉన్నారు. వివిధ అంశాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు పవన్‌కల్యాణ్‌ స్పందించారు.

"హింసను ప్రేరేపించే ఏ ప్రభుత్వాన్నీ ప్రజలు ఇష్టపడరు. ఓట్లు వేయరు. ఉభయగోదావరి జిల్లాల్లో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుంది. కోనసీమ అల్లర్లు కావాలనే చేశారని నాకు అనిపిస్తోంది. కేంద్ర నిఘావర్గాలు ముందే హెచ్చరించినా పోలీసులు పట్టించుకోపోవడం, ముఖ్యమంత్రి ఇంతవరకు దీనిపై స్పందించకపోవడం, డీజీపీ కూడా పట్టించుకోకపోవడం.. మంత్రులు ఎవరూ అక్కడికి వెళ్లకపోవడం చూస్తోంటే అదే అనిపిస్తోంది. డీజీపీ బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదు."- పవన్​

కోనసీమ తగలబడుతుంటే యాత్రలా? : "ఒక సమస్యను మళ్లించడానికి మరో సమస్య. ఒక రాజధాని నిర్మించలేకపోతే మూడు రాజధానులు. దానిపై రగడ.. పక్కదోవ పట్టించడం, ఎమ్మెల్సీ అనంత్‌బాబు విషయాన్ని పక్కకు మళ్లించడానికి కోనసీమ అల్లర్లు. కోనసీమలో అంబేడ్కర్‌పై గౌరవం లేక కాదు. ఇది వారి పార్టీలో రెండు గ్రూపుల మధ్య వివాదం. బహుజన సిద్ధాంతానికి వ్యతిరేకంగా పన్నిన పన్నాగంలా అర్థమవుతోంది. ఇదంతా కావాలని చేసినట్లుగా అనిపిస్తోంది. ఒకవైపు కోనసీమ తగలబడుతోంటే బస్సు యాత్రలు చేస్తారా? ఈ ఘటనలు ఏదో ఒక పార్టీకి మైనస్‌ కాదు.. మొత్తం ఆంధ్రప్రదేశ్‌కు మైనస్‌. దీన్ని ఎవరైనా తమకు అనుకూలంగా, ప్లస్‌గా తీసుకుంటే వారు సమాజహితం కోరుకునే వారు కాదు. ఒకవేళ జనసేన వారే ఇందులో ఉంటే అరెస్టు చేయండి. ఆస్తుల విధ్వంసానికి బాధ్యుల నుంచి రికవరీ చేయించాలనే ఆలోచన మంచిదే. ముందు వైకాపా వారిని ఇందుకు బాధ్యులను చేయాలి. ఇప్పటికే వైకాపా కాపులను, బీసీలను, మత్స్యకారులను, కమ్మవారిని వర్గ శత్రువులుగా ప్రకటించింది. చివరికి వారికి ఇతరులెవరూ మిగలరు. శివసేన అధికార ప్రతినిధి మాట్లాడుతూ కోనసీమ అల్లర్లలో మోదీ ప్రమేయం ఉందని అన్నారు. ఇందులో భాజపాకు ఎలాంటి సంబంధం లేదు. మోదీకి ఏ సంబంధం లేదు. వైకాపా తప్పులు చేసి కేంద్ర ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తోంది." అని పవన్​ కల్యాణ్​ అన్నారు.

ఆత్మకూరులో పోటీ చేయం:చనిపోయిన కుటుంబంలోని వారిని ఎన్నికల్లో నిలబెడితే జనసేన పోటీ చేయడం లేదని పవన్​ అన్నారు. ప్రస్తుతానికి ఇదే తమ విధానమని స్పష్టం చేశారు. ఆత్మకూరు ఉపఎన్నికలోనూ అదే పాటిస్తున్నామన్నారు.

జిన్నా బదులు కలాం పేరు మేలు: "రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై వివరించేందుకు డీజీపీ అపాయింట్‌మెంట్‌ కోరాం. ఇంతవరకు ఇవ్వలేదు. ఇచ్చే వాతావరణమూ కనిపించడం లేదు. ఇవ్వకపోతే కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఆయనపై ఫిర్యాదు చేస్తాం. జిన్నా దేశ విభజనకు మూలకారకుడు. దేశ విభజన వల్ల లక్షలమంది చనిపోయారు. అనేకమంది మహిళలపై అత్యాచారాలు జరిగాయి. గుంటూరులోని జిన్నా టవర్‌కు ఆ పేరే కావాలని కోరుకునే వారు ఇవన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఏ అబ్దుల్‌ కలాం పేరో పెట్టడం మంచిది. సున్నిత అంశాల ఆధారంగా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే వాటికి జనసేన మద్దతుగా నిలవదు. రామతీర్థం విషయంలో కూడా మేం ఎంతవరకు నిరసన వ్యక్తం చేయాలో అంతవరకే చేశాం. దోషులను శిక్షించాలి. కానీ సామాన్యులు, నిర్దోషులు ఇబ్బంది పడకూడదు" అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

గాల్లో మేడలు కట్టను..:భాజపా, జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా మీరే ఉంటారన్న ప్రచారం జరుగుతోంది కదా.. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు పవన్‌ స్పందించారు.. 'నేను గాల్లో మేడలు కట్టను. ఇదంతా ప్రచారం మాత్రమే' అన్నారు. చంద్రబాబు మహానాడుకు ముందు జనసేనతో వన్‌సైడ్‌ లవ్‌ అని అన్నారు. మహానాడు తర్వాత వార్‌ వన్‌సైడు అంటున్నారు ఏమంటారు? అని ప్రశ్నిస్తే 'సంతోషమే కదా' అని పవన్‌ బదులిచ్చారు. నడ్డా రాజమహేంద్రవరం పర్యటన సందర్భంగా ఆయనను కలిసే అవకాశమేదీ లేదని చెప్పారు. సీఎం దావోస్‌ పర్యటన.. పెట్టుబడులపై స్పందిస్తూ.. కేవలం ఈ పెట్టుబడుల కోసం దావోస్‌ వెళ్లడం ఖర్చుల దండగ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అధికారులు, తదితరులపై వైకాపా నాయకులు చేస్తున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ.. 'వాళ్ల అధినేత చరిత్రే అలంటిది కనుక కిందిస్థాయి నేతలు కూడా అదే బాటలో నడుస్తారు కదా' అని అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details