ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Janasena: అన్యాయాలు జరిగితే ఎదుర్కొనేందుకు వెనుకాడబోం: పవన్ కల్యాణ్

ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడానికి జనసేన అహర్నిశలు కృషి చేస్తోందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సగటు ప్రజల కన్నీళ్లు తుడవడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన పవన్ కల్యాణ్.. ఈ సందర్భంగా మాట్లాడారు. అన్యాయాలు జరిగితే బలంగా ఎదుర్కొనేందుకు వెనుకాడబోమన్నారు. ప్రజా ప్రతినిధులే బూతులు తిడుతుంటే.. మానభంగాలు జరగవా? అని ప్రశ్నించారు. సీఎం ఇంటి సమీపంలో ఉన్న వారికే న్యాయం జరగడం లేదన్నారు. జనసేన నేతలు, సర్పంచ్​లపై వైకాపా నేతలు దాడులకు దిగితే సహించేది లేదని హెచ్చరించారు.

Janasena
Janasena

By

Published : Jul 7, 2021, 7:50 PM IST

Updated : Jul 8, 2021, 5:30 AM IST

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ.. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో భేటీ అయింది. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ అధినేత పవన్ కల్యాణ్ .. మొదటగా కొవిడ్ మృతులకు నివాళులు అర్పించారు. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం మాట్లాడుతూ.. కరోనా కష్టకాలంలో చాలా మంది జనసైనికులు, వారి కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందన్నారు. వ్యక్తిగతంగా చాలా మంది సన్నిహితులను కోల్పోయానని... తానూ కొవిడ్‌ బారినపడ్డానని చెప్పారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా ఉండి, వారి కన్నీరు తుడవడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టడానికి జనసేన పార్టీ అహర్నిశలు కృషి చేస్తోందని చెప్పారు.

డ్రామానా.. నిజమా?..

‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల మధ్య ఎంతో సఖ్యత ఉంది కదా... అలాంటిది వారు గొడవ పడటం నమ్మశక్యంగా లేదని కొందరు తెలంగాణ నాయకులు చెప్పారు. మరోవైపు నీటివనరుల వినియోగంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదాలు సాగుతున్నాయి. జలవివాదం అనేది ప్రజలను మభ్యపెట్టేందుకు ఆడుతున్న రాజకీయ నాటకమా? లేక నిజంగా సమస్య ఉందా అని ప్రజలు ఆలోచించాలి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు, నీటి వాటాలపై మేధావులు, జల నిపుణులతో సదస్సులు నిర్వహించి సంపూర్ణ అవగాహనతో ఒక విధానం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో బుధవారం పార్టీ కొత్త కమిటీలను ప్రకటించారు. ఈ సందర్భంగా పవన్‌ ఏమన్నారంటే..

‘అధికారంలోకి వచ్చేందుకు వైకాపా ఉద్యోగాల భర్తీ హామీ ఇచ్చింది. ఆ హామీ నెరవేరేవరకూ నిరుద్యోగులకు అండగా ఉంటాం. ఇందుకోసం కార్యాచరణ రూపొందించాలని రాజకీయ వ్యవహారాల కమిటీకి సూచించాంమని అన్నారు. ముఖ్యమంత్రి ఇంటికి కూతవేటు దూరంలో అత్యాచారం జరిగితే మర్నాడు దిశ యాప్‌ విడుదల చేసే రాజకీయాలు కాదు. అత్యాచారాలు జరగని రాజకీయాలు రావాలి. సుగాలి ప్రీతి కేసులో దోషులను ఇంతవరకూ పట్టుకోలేదు. నా ఒక్కడి కోసం అయితే ఏదో పార్టీలో చేరిపోయేవాడిని. చిత్తశుద్ధితో సమస్యకు పరిష్కారాలు వెదికే సమాజం రావాలని కోరుకుని పార్టీ పెట్టాను.

పంటలకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఇంటి పన్నులు విపరీతంగా పెంచారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సంక్షేమ పథకాలు రావాలి. ఇప్పటివరకూ అధికారంలో లేని కులాలకు రాజ్యాధికారం సాధించేలా జనసేన అడుగులు వేస్తుంది. రాజకీయం అంటే ఎదుటి కులాలను తిట్టడం, అహంకారంతో మాట్లాడటం కాదు. చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలి. పెదపూడి విజయకుమార్‌ వంటి వారికి ప్రధానకార్యదర్శి పదవి ఇవ్వడానికి కారణం ఉంది. సెంట్రల్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తూ ఆయన ముందుకొచ్చారు.

కరోనాతో లక్షల మందిని కోల్పోయాం. ఇలాంటి సమయంలో బాధ్యతగా ఉండి పార్టీ నడిపించాలనే ఉద్దేశంతోనే ప్రజల మధ్యకు రాలేదు. కొత్త కార్యవర్గంలో మహిళలకు, యువతకు ఎస్సీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేశాం’ అని పవన్‌ తెలిపారు. ఈ సమావేశంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ పాల్గొన్నారు.

సోమశేఖర్​ కుటుంబానికి బీమా పరిహారం

ప్రాణాలను ఫణంగా పెట్టి కష్టాల్లోని ప్రజలకు జనసైనికులు అందించిన సాయం వెలకట్టలేనిదని పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తన వ్యక్తిగత సంపాదన నుంచి కోటి రూపాయలను జనసైనికుల బీమా పథకానికి ఇచ్చానని గుర్తు చేశారు. పార్టీ కోసం నిస్వార్థంగా పని చేసిన నంద్యాలకు చెందిన జనసైనికుడు ఆకుల సోమశేఖర్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా పరిహారం అందించారు.

పవన్​ను కలిసిన విద్యార్థి సంఘాల నేతలు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ తమ గోడును పవన్‌ కు విన్నవించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి సభ్యులు, విద్యార్ధి సంఘాల నేతలు పవన్​కు వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో 45 లక్షల మంది నిరుద్యోగులుంటే ఏపీపీఎస్సీ ద్వారా కేవలం 36 ఉద్యోగాలు ప్రభుత్వం ప్రకటించిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాదయాత్రలో అన్న వస్తున్నాడు నిరుద్యోగుల సమస్యలు తీరుస్తాడన్న జగన్మోహన్ రెడ్డి.. ఆ నాడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయారని ఆవేదన చెందారు. ఏటా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులు ఇస్తామన్న హామీని అమలు చేయడం లేదని ఆగ్రహించారు. నాడు – నేడు అంటూ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పిస్తున్నారని... ఉపాధ్యాయులు లేకుండా సౌకర్యాలు ఉంటే సరిపోతుందా? అని నిలదీశారు. 20 లక్షల మంది గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతుంటే 25 ఉద్యోగాలు విడుదల చేశారని... ఏటా 6500 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ లో 450 పోస్టులు మాత్రమే ప్రకటించి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు అని వాపోయారు. నిరుద్యోగులకు తాము అండగా ఉంటామని పవన్‌.. వారికి భరోసా ఇచ్చారు.

ఖాళీ చేయిస్తున్నారు.. అండగా ఉండండి

సీఎం నివాసానికి సమీపంలోని 320 కుటుంబాలు తమకు న్యాయం చేయించాలంటూ పవన్‌ను కలిశారు. అభివృద్ధి పనులు, ముఖ్యమంత్రి భద్రత పేరిట తాడేపల్లి క్యాంపు కార్యాలయం సమీపంలోని తమ ఇళ్లను ప్రభుత్వం ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఇళ్లను వైకాపా నాయకులు, ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. పునరావాసం ఏర్పాటు చేయకుండా, ఇళ్లు లాక్కుంటున్నారని బాధితులు వాపోయారు. ఇళ్లు ఖాళీ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. భద్రత దృష్ట్యా ఇళ్లు ఖాళీ చేయించాలంటే ముందుగా వారికి పునరావాసం కల్పించాలని.. భయపెట్టి, బెదిరింపులకు గురిచేసి ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే వారికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

దళితులపైనే అట్రాసిటీ కేసులు
రాజధాని గ్రామాల దళిత రైతులు పవన్‌ను కలిసి సమస్యలు విన్నవించారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసులు పెట్టి సీఐడీ కార్యాలయానికి రమ్మని పిలుస్తున్నారని వారు అన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రైతులను అవమానించేలా మాట్లాడుతున్నారని, ఎన్నికల ముందు ఇక్కడే రాజధాని అని మాటిచ్చి, ఇప్పుడు మోసం చేశారని వాపోయారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ సంఘం నాయకులు కలవగా పవన్‌ మాట్లాడారు. ‘భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి వారికే దక్కేవరకూ జనసేన పోరాడుతుంది. ప్రభుత్వం వారి అవసరాలు గుర్తించాలి’ అని కోరారు. స్టాఫ్‌నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది జనసేనానిని కలిశారు.

'జనసేన మద్దతుతో గెలిచిన సర్పంచ్ లను వైకాపా నేతలు బెదిరిస్తున్నారు. బూతులు తిడుతున్నారు. కొన్నిచోట్ల భౌతిక దాడులకు దిగుతున్నారు. ఇలాంటి దాడులకు జసేన భయపడదు. భయపడేవాళ్లమైతే పార్టీని పెట్టేవాళ్లం కాదు. రాష్ట్ర, జిల్లా నాయకులతో మాట్లాడి.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం. ఇందుకోసం ఓ ఫోరమ్​ను కూడా ఏర్పాటు చేస్తాం' - పవన్ కల్యాణ్, జనసేన అధినేత

వారికి పక్కా ఇళ్లు కట్టించాలి
తన ఇంటి పరిసరాల్లోని 320 కుటుంబాలకు న్యాయం చేయలేకపోతున్న ముఖ్యమంత్రి.. రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని పవన్‌కల్యాణ్‌ ప్రశ్నించారు. సీఎం ఇంటి చుట్టుపక్కల ఇళ్లు ఖాళీ చేయించాలంటే ముందుగా బాధితులకు పునరావాసం కల్పించాలని, పక్కా ఇళ్లు కట్టించాలని డిమాండ్‌ చేశారు. సీఎం ఇంటి సమీపంలో ఉండే పలువురు పవన్‌ను కలిసి తమ కష్టాలు తెలిపారు. ఇళ్లు ఖాళీ చేయించాలంటూ దుర్భాషలాడుతున్నారని, వాలంటీరు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని బాధితులకు మద్దతుగా వచ్చిన వాలంటీరు చెప్పారు.

నిరుద్యోగ పోరాటానికి అండ
రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల పోరాటానికి తమ పార్టీ అండగా ఉంటుందని పవన్‌ ప్రకటించారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఏపీ నిరుద్యోగ పోరాట సమితి సభ్యులు, విద్యార్థి సంఘాలు పవన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉద్యోగ క్యాలెండరు పేరుతో నిరుద్యోగుల ఆశలపై సీఎం జగన్‌ నీళ్లు చల్లారని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

CM Letter To PM: 'తెలంగాణ అక్రమ నీటి వాడకంపై చర్యలు తీసుకోండి'

Last Updated : Jul 8, 2021, 5:30 AM IST

ABOUT THE AUTHOR

...view details