గోదావరి నదికి వరద ఉద్ధృతి ప్రమాదకర స్థాయిలో ఉంటుందని కేంద్ర జల సంఘం హెచ్చరికలు చేసిన నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధతతో ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేటప్పటికే గోదావరి జిల్లాల్లోని లంక భూములు, కొన్ని గ్రామాలు నీట మునిగిపోయాయని మండిపడ్డారు.
ఉభయగోదావరి జిల్లాల రైతాంగం ఆందోళనలో ఉన్న విషయం తన దృష్టికి చేరిందన్న ఆయన... ఎగువన ఉన్న భద్రాచలంలో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తతతో తగిన పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు.. వారికి తగిన వైద్య, ఆరోగ్య, వసతులు కల్పించాలని కోరారు. ప్రస్తుతం వస్తున్న వరదలను ప్రత్యేక దృష్టితో చూసి అత్యంత జాగ్రత్తలు అనుసరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు.