ఏపీలో గత రెండేళ్లలో ఏకంగా 100కి పైగా దేవాలయాలపై దాడులు జరిగాయని జనసేన అధినేత పవన్‌క్యలాణ్ ఆరోపించారు. సోషల్ మీడియాలో వైకాపా నేతలపై పోస్టులు వ్యవహారంలో అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు.. ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆలయాలపై దాడుల నేపథ్యంలో పవన్ ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో రథాల దగ్ధం, దేవాతామూర్తుల విగ్రహాల ధ్వంసం పేరిట జరుగుతున్న అరాచకంపై మాట్లాడితే ప్రతిపక్షాలు రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్ నడిపిస్తున్నాయంటూ సీఎం జగన్ చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకోవడమేనన్నారు. సీఎం స్థానంలో ఉన్న ఆయన.. ఆధారాలు లేకుండా మాట్లాడితే జనం హర్షించరని హితవు పలికారు.
లోపం మీలోనా? మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా?
‘‘మీరు ఎంతటి శక్తిమంతులో దేశ ప్రజలందరికీ తెలుసు. మీపై గెరిల్లా వార్ ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారు? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐపీఎస్‌లు, మరో 115 మంది అదనపు ఎస్పీలు, వేలాది మంది పోలీసు సిబ్బంది మీ చేతుల్లో ఉండగా విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉంది. రాష్ట్రంలో 2.60లక్షల మంది వాలంటీర్లను నియమించారు.. వారు కూడా సమాచారం ఇవ్వలేకపోతున్నారా? లోపం ఎక్కడుంది? మీలోనా? మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా? పైగా ప్రతిపక్షాలు అన్నింటినీ ఒకే గాటన కట్టి దుష్ప్రచారం చేస్తున్నాయని మీరు చెప్పడం ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్లు ఉంది’’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి పవన్ ధ్వజమెత్తారు.