పవన్‌కళ్యాణ్‌కు రాజధానిలో భూములు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని... వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని జనసేన లీగల్ విభాగం కన్వీనర్ సాంబశివప్రసాద్ హెచ్చరించారు. జనసేనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేకనే కొందరు కుట్రలు పన్నారని సాంబశివప్రసాద్ ఆరోపించారు.
రాజధాని అమరావతిలోనే ఉండాలని జనసేన చేస్తున్న ప్రజా పోరాటాన్ని ఎదుర్కోలేక తప్పుడు ప్రచారానికి దిగారని విమర్శించారు. పవన్‌కు అమరావతిలో 62 ఎకరాలు ఉన్నాయంటూ... తప్పుడు పత్రాలు సృష్టించి గోబెల్స్ ప్రచారం చేయటం సరికాదన్నారు. ప్రచారం చేస్తున్న వారందరిపైనా పరువు నష్టం దావా వేస్తామని... ఒకటి రెండు రోజుల్లో లీగల్ నోటీసులు పంపుతామని సాంబశివప్రసాద్ వెల్లడించారు.