రాజధాని అమరావతి, అక్కడి గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జనసేన పార్టీ 20 పేజీల నివేదిక రూపొందించింది. ఇటీవల రాజధాని గ్రామాల్లో పర్యటించిన నాదెండ్ల మనోహర్, నాగబాబు.. తాము పరిశీలించిన అంశాలతో పాటు అమరావతి స్వరూపం, అక్కడి నిర్మాణాలు తదితర అంశాలపై నివేదికను తయారు చేశారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు అందజేశారు. అమరావతి విస్తీర్ణం, భూసమీకరణ, రైతులకు ఇచ్చిన హామీలు, కౌలు, అక్కడ పూర్తయిన నిర్మాణాలు, ప్రభుత్వ కార్యకలాపాలు, హైకోర్టు, ప్రస్తుతం వివిధ స్థాయిల్లో ఉన్న నిర్మాణాల వివరాలు పొందుపర్చారు. రైతుల ఆందోళనలనూ ప్రస్తావించారు.
జీఎన్ రావు కమిటీ నివేదికతో పాటు గతంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ రాజధాని అంశంపై ఏం చెప్పాయనేది నివేదికలో వివరించారు. పరిపాలనా వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు అని చెబుతున్న ప్రభుత్వం.. రెవెన్యూ లోటు ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు తరలించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా తేల్చారు.