జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ఐదు నియోజకవర్గాల్లో చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ప్రకటించారు. ఈనెల 26న ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి పది రోజుల్లోగా పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. గురువారం ఆయన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఇచ్ఛాపురం, రాజోలు, మంగళగిరి, నెల్లూరు గ్రామీణ, అనంతపురం నియోజకవర్గాల్లో ప్రయోగాత్మకంగా చేపట్టి అక్కడ ఎదురైన అనుభవాల ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. క్రియాశీలక సభ్యులకు బీమా పథకాన్ని వర్తింపజేయాలని చెప్పారు. సాధారణ సభ్యత్వం యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ప్రధాన కార్యదర్శులు తోట చంద్రశేఖర్, టి.శివశంకర్, బొలిశెట్టి సత్య తదితరులు పాల్గొన్నారు.
అగ్నికుల క్షత్రియుల్ని భాగస్వాములు చేయాలి
అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి నూతన రథం తయారీ పనుల్లో అగ్నికుల క్షత్రియుల్ని భాగస్వాముల్ని చేయాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. ‘‘అగ్నికుల క్షత్రియుడైన కొపనాతి కృష్ణమ్మ ఆ దేవస్థానాన్ని నిర్మించారు. తొలి రథం రూపొందించిందీ ఆయనే. ఇటీవల దగ్ధమైన రథాన్ని తయారుచేసిందీ స్థానిక అగ్నికుల క్షత్రియులే. కొత్త రథం తయారీ బాధ్యతను ఇతర రాష్ట్రాలవారికి అప్పగించారు. అంతకన్నా తక్కువ మొత్తానికే రథాన్ని రూపొందించగలవారు తమలో ఉన్నారని, ఆ బాధ్యతలు తమకే అప్పగించాలని అగ్నికుల క్షత్రియులు కోరుతున్నారు. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలి’’ అని పవన్ ఒక ప్రకటనలో కోరారు.