Gazette Implementation: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధి అమలు తీరుపై కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రాలతో చర్చించేందుకు రంగంలోకి దిగింది. నాలుగు కీలకమైన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ఈ నెల 28న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. చర్చించబోయే అంశాలపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు సోమేశ్‌కుమార్, సమీర్‌శర్మలకు లేఖ రాశారు.
చెరో రూ.200 కోట్లు ఇవ్వండి..
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డులకు చెరో రూ.200 కోట్ల చొప్పున మూలధనాన్ని రెండు రాష్ట్రాలు జమచేయాల్సి ఉంది. గడువు దాటినా జమ చేయకపోవడంతోపాటు ఇంత మొత్తం చెల్లించడం సాధ్యం కాదని, దశలవారీగా చెల్లిస్తామని కోరగా, కేంద్రం ఇందుకు అంగీకరించలేదు. ఈ అంశాన్ని సమావేశం అజెండాలో మొదటి అంశంగా చేర్చారు.
అందుకు అంగీకరించని తెలంగాణ..
కృష్ణా, గోదావరి బేసిన్లలోని మొత్తం ప్రాజెక్టులను నోటిఫికేషన్‌లో చేర్చిన కేంద్రం, పూర్తిగా బోర్డుల అజమాయిషీలో ఉండే వాటిని రెండో షెడ్యూల్‌లో చేర్చింది. రాష్ట్రాల పర్యవేక్షణలో ఉండి నీటి వినియోగ వివరాలను బోర్డులకు అందజేసే ప్రాజెక్టులను మూడో షెడ్యూల్‌లో ఉంచింది. రెండో షెడ్యూల్‌లోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడంపై పలు దఫాల చర్చలు జరిగినా ముందడుగు పడలేదు. కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తెస్తే సరిపోతుందని పేర్కొన్న ఆంధ్రప్రదేశ్, శ్రీశైలం ప్రాజెక్టును అప్పగిస్తూ ఉత్తర్వు జారీ చేసింది. అయితే తెలంగాణ అప్పగించిన తర్వాతనే అనే మెలిక పెట్టింది. ఇప్పటివరకు ఏ ప్రాజెక్టునూ అప్పగించని తెలంగాణ, ముఖ్యంగా శ్రీశైలం జలవిద్యుత్తు కేంద్రాన్ని బోర్డు పరిధిలోకి తేవడానికి అంగీకరించలేదు.