Jagan policies responsible for power cuts: 2014 జూన్ 2న రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉండేది. రాష్ట్ర డిమాండుకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి లేక సర్దుబాటు కోసం రోజూ 15 మిలియన్ యూనిట్లు (ఎంయూ) కోతలు పెట్టేవాళ్లు. అయిదు నెలల్లో విద్యుత్ కోతలు లేని రాష్ట్రంగా అప్పటి ప్రభుత్వం తీర్చిదిద్దింది. గతంలో తెదేపా హయాంలో 2014 నుంచి 2019 మధ్య 8వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్తు అందుబాటులోకి వచ్చింది. కానీ, వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి ఇప్పటివరకూ కొత్తగా ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో విద్యుత్‌రంగ పరిస్థితి దిగజారి 2014 ప్రారంభంలో మాదిరే కోతలు విధించే పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడింది.
విభజన నాటికి రాష్ట్ర విద్యుత్ డిమాండు సమారు 139 ఎంయూలుగా ఉంటే.. 124 ఎంయూలే అందుబాటులో ఉండేది. దీంతో అప్పట్లో రోజూ 15 ఎంయూలను లోడ్ రిలీఫ్ పేరిట డిస్కంలు కోత విధించి సర్దుబాటు చేశాయి. అప్పట్లో పునరుత్పాదక విద్యుత్ 3.19 ఎంయూలు మాత్రమే. రాష్ట్ర విభజన నాటికి పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి 500 మెగావాట్లే వచ్చేది. 2015 నుంచి అప్పటి ప్రభుత్వం పవన, సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటును ప్రోత్సహించింది. దీంతో పునరుత్పాదక విద్యుత్ 12.11 ఎంయూలకు పెరిగింది. 2019 నాటికి పవన విద్యుత్ 4,179 మెగావాట్లు, సౌర విద్యుత్ 2,882 మెగావాట్ల ప్రాజెక్టులు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. వాటి ద్వారా సీజన్‌లో సుమారు 50-60 ఎంయూల విద్యుత్ వచ్చే అవకాశం ఏర్పడింది. దీనివల్ల రాష్ట్ర విద్యుత్ డిమాండు 191 ఎంయూలకు చేరినా కోతలు విధించాల్సిన అవసరం రాలేదు.
సౌర విద్యుత్తులో ఎదురుదెబ్బలు..:ప్రాజెక్టుల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం చేసిన ప్రయత్నాలపైనా భారీ విమర్శలు వచ్చాయి. వ్యసాయానికి ఉచిత విద్యుత్ అందించడానికి 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ప్రత్యేకంగా ఏపీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ (ఏపీజీఈఎల్) అనే సంస్థను ఏర్పాటుచేసింది. ప్లాంట్ల ఏర్పాటుకు రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 50 వేల ఎకరాలను సంస్థ గుర్తించింది. మొదటి విడతగా 6,400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 2020 ఆగస్టులో ఏపీజీఈఎల్ టెండర్లను పిలిచింది. సాంకేతిక బిడ్‌ల పరిశీలన తర్వాత 2021 ఫిబ్రవరి మొదటి వారంలో ప్రైస్ బిడ్‌లను ఏపీజీఈఎల్ తెరిచింది. ఎన్‌టీపీసీ 600 మెగావాట్లు, టొరెంటో పవర్స్ లిమిటెడ్, హెచ్‌ఈఎస్ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌లు ఒక్కొక్కటీ 300 మెగావాట్లు.. మిగిలిన 5,200 మెగావాట్లకు అదానీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ బిడ్‌లు దాఖలు చేశాయి.