రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ఏటా రూ.10 వేల ఆర్థికసాయం అందించే ‘జగనన్న చేదోడు’ పథకాన్ని జూన్ తొలి వారంలో ప్రారంభించేందుకు బీసీ కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే లబ్ధిదారుల ఎంపిక దాదాపు పూర్తికావొచ్చింది. ఈ పథకం కింద మొత్తం 2,50,015 మంది లబ్ధిదారులను గుర్తించింది. ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాను మే 18 నుంచి 25 వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించనుంది.
జాబితాపై వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాల ఆధారంగా వాలంటీర్లతో సామాజిక తనిఖీలు చేయించి 26న తుది జాబితా ఖరారు చేస్తుంది. ‘జగనన్న చేదోడు’ పథకం కింద సొంత దుకాణాలున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీల జీవనోపాధి పెంపునకు ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థికసాయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి ఏడాది సాయాన్ని ఈ జూన్‌లో ఇవ్వనుంది. సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుంది.