సీఎం జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ నేరాభియోగాలు వేర్వేరని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వాదించింది. కాబట్టి సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ అభియోగపత్రాలపై ప్రత్యేకంగా విచారణ చేపట్టాలని సీబీఐ, ఈడీ కోర్టును... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోరింది. సీబీఐ కేసులు తేలకముందే ఈడీ కేసుల విచారణ చేపట్టవద్దని జగన్, విజయ్ సాయిరెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ ఛార్జ్ షీట్ల ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేసింది కాబట్టి... సీబీఐ కేసులు తేలిన తర్వాత లేదా రెండు సమాంతరంగా విచారణ జరపాలని జగన్ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఇటీవల వాదించారు. ఆ విషయంపై.. ఇవాళ ఈడీ తరఫు న్యాయవాది సుబ్బారావు వాదనలు వినిపించారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం సీబీఐ కేసులు తేలే వరకు ఈడీ కేసులను పక్కన పెట్టాల్సిన అవసరం లేదన్నారు. ఏ కేసు అభియోగాలు అవేనని.. ఒకదానితో ఒకటి చూడవద్దన్నారు. తమ వాదనను బలపరిచే సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులు, ఇతర ఆధారాలు సమర్పించి.. వాదనలు కొనసాగించేందుకు సమయం ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాది కోరారు. అంగీకరించిన కోర్టు విచారణ ఈనెల 9కి వాయిదా వేసింది.
జగతి పబ్లికేషన్స్ లో పెట్టుబడులపై సీబీఐ ఛార్జ్ షీట్ నుంచి తనను తొలగించాలని కోరుతూ జగన్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ పైనా విచారణ ఈనెల 9న కొనసాగనుంది. మరోవైపు అనిశా న్యాయస్థానంలో గాలి జనార్దన్ రెడ్డి బెయిల్ కుంభకోణం కేసు విచారణ ఈనెల 9కి వాయిదా పడింది. మరో ఐదుగురు సాక్షులను కొత్తగా చేర్చేందుకు ఏసీబీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది. సచివాలయంలో ఫైళ్లు మరో చోటకు మారినందున కొన్ని రికార్డులు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని ఏసీబీ కోరగా విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.