రాష్ట్రంలో రిమోట్ వర్క్ విధానంపై త్వరలోనే వివిధ సంస్థలతో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. పారిశ్రామిక పరివర్తన దిశగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడానికే ఐఎస్బీ భాగస్వామ్యంతో ముందుకువెళుతున్నామని ఆయన స్పష్టం చేశారు.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విశాఖ కేంద్రంగా ఫార్మా సహా పలు రంగాలను అభివృద్ధి చేసేందుకు ప్రఖ్యాత విదేశీ విశ్వవిద్యాలయం జాన్స్ హాప్ కిన్స్ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిందని చెప్పారు. ఈ-గవర్నెన్స్ లో మరో స్థాయిని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా నైపుణ్యం పెంచడం, పాలసీ ల్యాబ్ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.