వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి అందరికీ వాక్సిన్ వేయగలుగుతామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వచ్చే ఫిబ్రవరి వరకు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శానిటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కొవిడ్ వాక్సినేషన్‌పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. పలు విభాగాల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ అమలు సహా అవసరమయ్యే డోసులు, ఉత్పత్తి సామర్థ్యం తదితర అంశాలన్నింటిపై సమగ్రంగా చర్చించారు.
వాక్సినేషన్ మాత్రమే పరిష్కారం..
కొవిడ్‌కు ఇప్పుడు కేవలం వాక్సినేషన్ మాత్రమే ఒక పరిష్కారంగా ఉందని అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి జగన్. వాక్సినేషన్ సమస్య ఎప్పుడు తీరుతుందో తెలియదన్నారు. దేశంలో వాక్సిన్ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్లు ఉందన్న సీఎం జగన్.. వీటిలో కోటి వాక్సిన్లు కోవాక్సిన్, మిగిలినవి కోవీషీల్డ్ ఉన్నాయన్నారు. దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారు 26 కోట్లు ఉన్నారని, వీరికి నాలుగు వారాల వ్యవధిలో రెండో డోస్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఆ మేరకు మొత్తం 52 కోట్ల వాక్సిన్లు కావాలన్నారు. తొలి డోస్ ఇప్పటి వరకు కేవలం 12 కోట్ల మందికి మాత్రమే వేశారని, 2.60 కోట్ల మందికి ఇప్పటి వరకు రెండో డోస్ మాత్రమే వేశారని తెలిపారు.
ఇంకా 39 కోట్ల డోస్‌లు కావాలి..
మొత్తం కలిపి చూసినా ఇప్పటివరకు వేసిన వాక్సిన్ డోస్‌లు దాదాపు 15 కోట్లు మాత్రమేనని జగన్ వివరించారు. ఇంకా 39 కోట్ల డోస్‌లు కావాల్సి ఉందన్నారు. భారత్ బయోటెక్ నెలకు కోటి వాక్సిన్లు తయారు చేస్తుండగా... సీరమ్ ఇన్‌స్టిట్యూట్ 6 కోట్ల వాక్సిన్లు తయారు చేస్తోందని, రెడ్డీ ల్యాబ్స్, ఇతర సంస్థల ఉత్పత్తి చేయడానికి ఇంకా సమయం పడుతుందని సీఎం చెప్పారు. ఆగస్టు నాటికి కొత్తగా 20 కోట్లు వాక్సిన్లు ఉత్పత్తి కావొచ్చని, దీనికి ఇప్పుడున్న 7 కోట్లు అదనం అని వివరించారు. ఈ లెక్కన 39 కోట్ల వాక్సిన్ డిమాండ్ ఆగస్టు లేదా సెప్టెంబరు నాటికి కానీ పూర్తి కాదని అంచనా వేశారు.
ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి..
18-45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు దేశంలో 60 కోట్లు ఉన్నారని, వారికి 120 కోట్ల కరోనా వాక్సిన్ డోస్‌లు కావాల్సి ఉంటుందని జగన్ వివరించారు. 45 ఏళ్లకు పైబడిన వారందరికీ వాక్సినేషన్ పూర్తయ్యాక, 18-45 ఏళ్ల మధ్య వయస్సు వారికి సెప్టెంబరు నుంచి వాక్సిన్ ఇవ్వొచ్చని అంచనా వేస్తున్నట్లు సీఎం తెలిపారు. 18 నుంచి 45 ఏళ్ల వారికి వాక్సినేషన్ పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుందన్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి వారందరికీ వాక్సీన్ చేయగలుగుతామని, ఇదీ వాస్తవ పరిస్థితి అని సీఎం జగన్ అన్నారు. వచ్చే ఏడాది దాదాపు ఫిబ్రవరి వరకు ఇదే పరిస్థితి ఉంటుందిని, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... 'కరోనా అనుమానంతో ఆసుపత్రికి వెళ్తే.. కాటికి పంపారు'