ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

GANDHIJI: గాంధీజి కొల్లాయి (ధోవతి) కట్టి నేటికి వందేళ్లు - మహాత్మ గాంధీ

కొల్లాయి కట్టితేనేమి...? నిజమే, కొల్లాయి (ధోవతి) కడితే ఏమవుతుందో ఆనాడు ఎవరూ ఊహించలేక పోయారు. కానీ మారిన గాంధీజీ డ్రెస్‌ జాతీయోద్యమాన్నే మార్చేసింది. భారతావనికి ఓ ఆత్మీయ నాయకుడిని ఇచ్చింది! మహాత్ముడు సామాన్యుడి అంగవస్త్రంలోకి మారి నేటికి సరిగ్గా నూరేళ్లు!

it-is-hundreds-of-years-since-gandhiji-wore-the-dhoti
గాంధీజి కొల్లాయి (ధోవతి) కట్టి నేటికి వందేళ్లు

By

Published : Sep 22, 2021, 12:26 PM IST

నా జీవితంలో అనేక మార్పులకు అనూహ్య సందర్భాలు కారణమయ్యాయి. చాలా ఆలోచించి ఆయా సందర్భాల్లో నేనా నిర్ణయాలు తీసుకున్నాను. వాటిపై ఏ కోశమైనా విచారం లేదు నాకు. అలాంటివాటిలో విప్లవాత్మకమైన మార్పు- నా డ్రెస్‌! మదురైలో జరిగిందిది! - మహాత్మాగాంధీ

దక్షిణాఫ్రికా నుంచి వచ్చి జాతీయోద్యమంలో పాల్గొనాలనుకున్న మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీకి ఆయన రాజకీయ గురువు గోపాలకృష్ణ గోఖలే చెప్పిన మాట- నాయకుడిగా ఎదగాలంటే ఒకసారి నీ దేశం గురించి, ప్రజల గురించి తెలుసుకో అని! దీంతో దేశాటనం మొదలెట్టారు గాంధీజీ! లండన్‌లో లా చదివి, దక్షిణాఫ్రికాలో ప్రాక్టీస్‌ చేసినప్పుడు తొలుత సూటూబూటూ, తలపై టోపీ ధరించేవారు. భారత్‌ వచ్చాక గుజరాతీ సంప్రదాయ దుస్తుల్లో తలపై పాగాతో సంపన్నంగా కన్పించేవారు. ఆ దుస్తుల్లోనే దేశాటనకు బయల్దేరి ఓ రోజు చెన్నై నుంచి మదురై వెళుతుంటే రైల్లో సామాన్యులతో సంభాషించారు. విదేశీ వస్త్రాలను బహిష్కరించి... మన స్వదేశీ ఖాదీ కట్టుకోవాలి... అన్నప్పుడు- ‘మేం పేదలం. ఖరీదైన ఖాదీ మాకు అందుబాటులో లేదు’ అంటూ వారినుంచి వచ్చిన సమాధానం గాంధీని ఆలోచనలో పడేసింది. ఒళ్లు కన్పించకుండా పైనుంచి కింది దాకా దుస్తులు ధరించిన తానొకవైపు... పక్కటెముకలు లెక్కించటానికి వీలైన రీతిలో సరైన దుస్తులు లేని నిరుపేద సామాన్యులొకవైపు! అలా మొదలైన ఆలోచనలన్నింటికీ మదురై రైల్లో అనుభవం తోడై... కొత్త ఆహార్యానికి మొగ్గతొడిగింది.

1921, సెప్టెంబరు 22న మదురై నుంచి రామనాథపురం వెళ్లాల్సి ఉంది. మదురై వెస్ట్‌మాసి వీధిలోని ఓ ఉద్యమకారుడి ఇంట్లో దిగిన గాంధీజీ కోసం ఉదయమే వేలమంది బయట వేచి చూస్తున్నారు. బయటకు వచ్చిన గాంధీజీని చూసి అంతా ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆనందంతో చప్పట్లు కొట్టారు. సామాన్య భారతీయుడిలా ధోవతి కట్టి... పైన చిన్న శాలువా కప్పుకొన్న గాంధీజీకి రామనాథపురం దాకా అడుగడుగునా హారతులే! గాంధీజీ తొలిసారి సామాన్యుడి అవతారంలోకి మారిన ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ గాంధీ పొట్టల్‌ అని పిలుస్తారు. అలాగని తనలాగే అందరూ అంగవస్త్రంతో... పైన కండువాతో ఉండాలని ఆయన ఎన్నడూ చెప్పలేదు. ‘‘నాలాగే అందరూ ధోవతి ధరించాలని నేను కోరుకోవటం లేదు. విదేశీ వస్త్రాల బహిష్కరణ అంటే ఏంటో అర్థం చేసుకొని, స్వదేశీ ఖాదీని మరింత ఎక్కువగా తయారు చేయాలన్నదే నా కోరిక’’ అని గాంధీ నవజీవన్‌ పత్రికలో స్పష్టం చేశారు.

చక్రవర్తి సమావేశానికీ అలాగే...

ఈ ధోవతి కేవలం పైపై ఆహార్యానికే కాదు... ఆయనలో చోటుచేసుకున్న అంతర్గత విప్లవానికీ ప్రతీక! ఏ పరిస్థితుల్లోనూ ఆయన తన ఆహార్యాన్ని మార్చుకోలేదు. లండన్‌లో రౌండ్‌టేబుల్‌ సమావేశానికి హాజరైన గాంధీని ఈ దుస్తుల్లో చూసిన బ్రిటిష్‌ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ అసహనంతో ‘అర్ధనగ్న ఫకీర్‌’ అంటూ హేళన చేశారు. బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో కింగ్‌ జార్జి-5తో విందుకు ఇలాంటి దుస్తులతో రావటానికి అనుమతించబోమంటే చక్రవర్తితో భేటీ వదులుకుంటాగాని దుస్తులు మార్చుకునేది లేదని స్పష్టం చేశారు గాంధీజీ! చేసేది లేక అలాగే అనుమతినిచ్చింది బ్రిటిష్‌ ప్రభుత్వం!

‘చక్రవర్తితో సమావేశానికి సరైన దుస్తులెందుకు ధరించలేద’ని బ్రిటిష్‌ మీడియా అడగ్గా... ‘మా ఇద్దరికీ సరిపడా దుస్తుల్ని ఆయనే (చక్రవర్తే) ధరించారు’ అని చమత్కారంగా చురకంటించారు గాంధీజీ! అలా సామాన్యుడి ఫ్యాషన్‌ గాంధీజీని విలక్షణుడిగా నిలబెట్టింది. 1994లో వాటికన్‌లో తనను కలవటానికి వచ్చిన ఓ గాంధేయవాదితో పోప్‌ జాన్‌పాల్‌-2 గాంధీజీ దుస్తులతీరు గురించి ప్రస్తావించారు. ‘‘గాంధీ ధోవతిలోకి మారటం మామూలు పని కాదు. అదో ఆధ్యాత్మిక చర్య’’ అని పోప్‌ అభివర్ణించారు.

ఇదీ చూడండి:Ayyadevara Kaleswara Rao: స్వాతంత్య్రోద్యమ తొలితరం తెలుగు నేత..మన అయ్యదేవర

ABOUT THE AUTHOR

...view details