Nadu-Nedu:ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ‘నాడు-నేడు’ రెండో దశకు నిధుల కొరత కారణంగా పనుల ప్రారంభంలో తీవ్ర జాప్యం నెలకొంది. రెండోవిడతకు గత ఏడాది ఆగస్టు 16న సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది జులైలో పూర్తి చేస్తామని ప్రకటించారు. శంకుస్థాపన చేసి 10నెలలు గడిచినా ఇప్పటికీ పనుల్లో వేగం లేదు. ఈ నెలాఖరులోగా అన్నిచోట్ల పనులు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ సమీక్షలో సీఎం ఆదేశించినా ఆ స్థాయిలో సన్నద్ధత కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండోవిడత పనులు ఎప్పటికి పూర్తవుతాయన్నది ప్రశ్నార్థకమే.
నాబార్డు నిధుల విడుదలలో జాప్యం..
నాబార్డు నిధులు రూ.2,538కోట్లతో 3,199 బడుల్లో పనులు చేపట్టేందుకు పాఠశాల విద్యాశాఖ ఈ ఏడాది ఫిబ్రవరి 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో రూ.1,378కోట్లతో 1,196 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరో 2,003 పాఠశాలల్లో అదనపు గదులు, అదనపు మౌలికసదుపాయాలు కల్పించనున్నట్లు పేర్కొంది. నాబార్డు నిధులు విడుదల కావడంలో జాప్యం ఏర్పడింది.
* ప్రపంచబ్యాంకు పాఠశాలల్లో అభ్యసన మెరుగుకు రూ.1,862కోట్లు రుణం ఇస్తుంది. ఇందులో మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం, భవనాల మరమ్మతు, ఫర్నిచర్, స్మార్ట్ టీవీ, లైట్లు, ఫ్యాన్లు లాంటి మౌలికసదుపాయాల కల్పనకు నిధులు ఇవ్వనుంది. మొదటిదశలో వ్యయం చేసిన రూ.3,669కోట్లకు రీయంబర్స్‌మెంట్ చేయాలని విద్యాశాఖ కోరింది. ఇటీవలే ప్రపంచబ్యాంకు బృందం ఆయా పాఠశాలలను సందర్శించింది. రూ.1,500కోట్ల వరకు ఇవ్వనుంది.
* ‘నాడు-నేడు’కు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విరాళాలు తీసుకోవాలని నిర్ణయించారు. కేంద్ర సంస్థలు, ఇతరత్రా ఏజెన్సీల నుంచి రుణాలు తీసుకోగా.. మిగతా మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది.
గదులు లేకుండానే బెంచీలు కొనుగోలు..
అదనపు తరగతి గదుల నిర్మాణాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకుండానే డ్యుయల్ డెస్క్‌లు కొనేందుకు టెండర్లు పూర్తి చేశారు. సుమారు 2.20లక్షల డ్యుయల్ డెస్క్‌లను సుమారు రూ.268కోట్లతో కొనుగోలు చేసేందుకు గుత్తేదారు సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. పనులపై దృష్టిపెట్టాల్సిన ఏపీ విద్య, సంక్షేమ మౌలికసదుపాయాల కల్పన సంస్థ (ఏపీఈడబ్ల్యుఐడీసీ) టెండర్లకే ప్రాధాన్యం ఇస్తోందన్న విమర్శలు వినవస్తున్నాయి. ఇనుము ధరలు అధికంగా ఉన్న సమయంలో ఈ టెండర్ల ప్రక్రియను పూర్తి చేయడం గమనార్హం.
* గదుల నిర్మాణం పూర్తి చేసేందుకు నాలుగైదు నెలలకుపైగా సమయం పడుతుంది. ఇవి అందుబాటులోకి వస్తే విద్యార్థులు చెట్ల కింద కూర్చునే సమస్య తప్పుతుంది.