వారాంతం వస్తోందంటే ఐటీ ఉద్యోగులకు పండగే.. ఎలా ఆస్వాదించాలని నాలుగైదు రోజుల ముందు నుంచే ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం నగరంలో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో ఎక్కువ మంది తమ పంథా మార్చేశారు. పబ్‌లు, డీజేలకు బదులు.. శివారు ప్రాంతాల్లోని వ్యవసాయ క్షేత్రాల బాట పడుతున్నారు. కుటుంబంతో కలిసి ఐదారు గంటలు హాయిగా గడిపేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. నగరానికి 100కి.మీల పరిధిలోని మూడు నుంచి 100 ఎకరాల వ్యవసాయ క్షేత్రాల నిర్వాహకులు ఇందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక రోజులో వెళ్లి వచ్చేలా ఉండటం, ప్రకృతితో కాస్త దగ్గరగా ఉన్నామనే అనుభూతి పొందడంతో పాటు తమ పిల్లలతో ఓ ఆహ్లాదకర వాతావరణంలో గడిపామనే సంతృప్తి పొందుతున్నారు. సందర్శకులను ఆకర్షించేందుకు నిర్వాహకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇవీ ప్రత్యేకతలు
* పల్లెటూళ్లలో జీవన శైలి ఈ తరం పిల్లలకు తెలియాలన్న ఉద్దేశంతో కొన్ని వ్యవసాయ క్షేత్రాల్లో ఫార్మ్ స్కూల్ పేరుతో సర్టిఫైడ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విజిట్ పేరుతో ఆరుగంటలు ఆ వాతావరణంలో గడిపేందుకు ఒక్కో వ్యక్తికి రూ.500 ఛార్జీ వసూలు చేస్తున్నారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, స్నాక్స్ అందిస్తున్నారు. పశువులకు మేత వేయడం, పాలు పితకడం, మిద్దె తోటల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు.
* జూనియర్ ఫార్మర్, న్యాచురల్ ఫార్మర్, అర్బన్ ఫార్మింగ్ పేరుతో వారికి మెలకువలు అందిస్తున్నారు. ఇండస్ట్రీ విజిట్ తరహాలో సబ్బులు, జామ్‌లు, ఫినాయిల్ వంటి 40 రకాల ఉత్పత్తుల తయారీని నేర్పిస్తున్నారు.