ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Air Conditioner Load: ఏసీల బిగింపులో అవగాహన అవసరం: విద్యుత్​ రంగ నిపుణులు - ఏసీ లోడ్

Air Conditioner Load : వేసవి తాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మార్చిలోనే మే నెలను తలపించే ఎండలు కాస్తున్నాయి. ఉక్కపోతతో ప్రజలు ఇళ్లలో ఏసీల వాడకం.. కొత్త ఏసీల బిగింపు పనులు మొదలుపెట్టారు. అయితే ఏసీ వాడకంపై అవగాహన లేక చాలా మంది కిలోవాట్ లోడ్‌పైనే ఏసీలు బిగిస్తున్నారు. విద్యుత్ తనిఖీల్లో తరచూ ఈ తరహా కేసులు బయటపడుతున్నాయని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు.

Air Conditioner Load
Air Conditioner Load

By

Published : Mar 22, 2022, 12:26 PM IST

Air Conditioner Load : కొత్తగా ఇంట్లో ఏసీ ఏర్పాటు చేస్తున్నారా? ఇప్పటికే ఒకటి ఉంటే, రెండో దానికి వెళ్తున్నారా? అయితే అంతకంటే ముందు ఇంట్లోని విద్యుత్తు కనెన్షన్‌ లోడు పరిశీలించడంతో పాటు విద్యుత్తు తీగల సామర్థ్యం సరిపోతుందో..లేదో తనిఖీ చేయించాలని విద్యుత్తు రంగ నిపుణులు సూచిస్తున్నారు. ఎండలు ముదరడంతో ఇళ్లలో ఏసీల వాడకం, కొత్త ఏసీల బిగింపు పనులు మొదలయ్యాయి. అవగాహన లేక చాలామంది ఒక కిలోవాట్‌ లోడ్‌పైనే ఏసీలు బిగిస్తున్నారు. విద్యుత్తు తనిఖీల్లో తరచూ ఈ తరహా కేసులు బయటపడుతున్నాయి.

ఇలా చేయండి..

  • కొత్త ఇళ్లలో ఏసీల కోసం ప్రత్యేకంగా పాయింట్లు, స్విచ్‌ సాకెట్లు ఉంటున్నాయి. పాత ఇళ్లలో ఏసీలు బిగించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని గచ్చిబౌలిలోని ఇంజినీర్స్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలోని విద్యుత్తు, ఇంధన విభాగ అధిపతి యూ.విద్యాసాగర్‌ సూచిస్తున్నారు
  • ఏసీ ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు త్రిఫేజ్‌ కనెన్షన్‌ ఉందో లేదో చూడాలి. లేకపోతే మార్చించుకోవాలి.
  • సింగిల్‌ ఫేజ్‌లోనే ఏసీ నడవాలంటే ఒకటే ఫేజ్‌ మీద ఇంట్లో ఉపకరణాల లోడు పడకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఏసీ నడుస్తున్నప్పుడు గీజర్‌ వేయడం, ఐరన్‌ చేయడం వంటివి చేయకూడదు.
  • ఇప్పటికే ఒక ఏసీ ఉండి.. రెండోది ఏర్పాటు చేస్తుంటే త్రిఫేజ్‌కు మారాల్సిందే. ఇందులో కనీసం 5 కిలోవాట్ల కనెక్టెడ్‌ లోడు ఉంటుంది. కాబట్టి ఫ్యూజులు ట్రిప్‌ కావు.
  • ఏసీలు ఎక్కువగా 1.5 టన్నువి బిగిస్తున్నారు. ప్రారంభంలో ఇవి ఎక్కువ కరెంట్‌ను వినియోగిస్తాయి. 1,500 వాట్స్‌ కావాల్సి ఉంటుంది. అందుకే విద్యుత్తు కనెన్షన్‌ లోడు తగినంత ఉండేలా పెంచుకోవాలి. ఒక కిలోవాట్‌ కనెన్షన్‌ ఉంటే రెండు లేదా మూడు కిలోవాట్ల కనెన్షన్‌ తీసుకోవాలి.
  • స్తంభం నుంచి మీటర్‌ బాక్స్‌ వరకు సర్వీసు తీగ పాతదైతే మార్చుకోవాలి. ఏసీ పాయింట్‌ వరకు ఎక్కువ సామర్థ్యం కల్గిన తీగలు ఉండాలి. లేకపోతే ఏసీ ఎక్కువ సేపు నడిస్తే లోడ్‌ పెరిగి తీగ కాలిపోయే ప్రమాదం ఉంది. స్విచ్చు బోర్డుల్లో స్పార్క్‌ వచ్చి మంటలు అంటుకునే ప్రమాదం ఉంది.
  • 20 యాంప్స్‌ భారం పడే ఏసీ వంటి పరికరాలకు కోసం.. అందుకు తగ్గ వైరింగ్‌, స్విచ్‌లు ఉండాల్సిందే.
  • కరెంట్‌ హెచ్చుతగ్గుల సమయంలో అధిక విద్యుత్తు ప్రసారమైతే ట్రిప్‌ అయ్యేలా ఎంసీబీ ఉండాలి.

విద్యుదాఘాతాల నివారణకు

  • పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాల్లో ఇటీవల వరస అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఎక్కువగా విద్యుదాఘాతాలే కారణమని బాధితులు చెబుతున్నారు.
  • పరిశ్రమల్లో ముఖ్యంగా ఎల్‌టీ కేటగిరీలో కాంటాక్ట్‌ లోడుకు మించి కొన్నిసార్లు విద్యుత్తు వినియోగిస్తుంటారు. ముఖ్యంగా కొత్త మిషనరీ పరీక్షించే సమయంలో ఓవర్‌లోడ్‌తో ప్రమాదాలు జరుగుతుంటాయి.
  • ఎక్కువ ప్రమాదాలకు పాత తీగలే కారణం. వీటిని ఎప్పటికప్పుడు మార్చాలి.
  • యంత్రాలు నడిచేటప్పుడు వాటిని ఆపరేట్‌ చేసే సిబ్బంది అక్కడే ఉండాలి. చాలాసార్లు ఆన్‌చేసి నైపుణ్యం లేని వ్యక్తుల మీద వదిలేస్తారు. ప్రమాదాలకు ఇవీ కారణాలే.
  • విద్యుత్తు స్పార్క్‌ వచ్చే చోట త్వరగా మంటలు అంటుకునే కాగితాలు, కాటన్‌, దుస్తులు, ఇంధనం లేకుండా చూసుకోవాలి.
  • రాత్రి పూట పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాల్లో లైటింగ్‌ కోసం తప్ప.. మిగతా చోట్ల సరఫరా నిలిపివేసే ఏర్పాట్లు ఉండాలి.

ABOUT THE AUTHOR

...view details