న్యాయవాదులు వామనరావు దంపతుల జంటహత్యలపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియో క్లిప్పింగ్‌లు చట్టప్రకారం సాక్ష్యాలుగా పనికొస్తాయా? ఇప్పుడు చాలామందిలో మెదులుతున్న ప్రశ్న ఇది. ఇవి సాక్ష్యాలుగా చెల్లుబాటవుతాయని, అయితే కోర్టుకు సమర్పించిన వీడియోల్లో ఎలాంటి ఎడిటింగ్ జరగలేదనే విషయాన్ని ధ్రువీకరించాల్సి ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు.
ఈ సాక్ష్యానికి మూలధారమైన పరికరం, దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రం తప్పనిసరని అభిప్రాయపడ్డారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఆమోదయోగ్యమేనంటూ గతంలో ఉమ్మడి హైకోర్టు తీర్పు వెలువరించిందని న్యాయవాది టి.ప్రద్యుమ్నకుమార్‌రెడ్డి తెలిపారు. అయితే వీడియో, ఫొటో ఎవరు తీశారో ఆ వ్యక్తిని కూడా సాక్షిగా పిలవాల్సి ఉంటుందన్నారు. చనిపోతున్న వ్యక్తి ఆఖరు మాటలను నమోదు చేయడానికి డాక్టరు, మేజిస్ట్రేట్‌లే అయి ఉండాల్సిన అవసరంలేదన్నారు. ఎవరు రికార్డు చేసినా అది మరణ వాంగ్మూలమే అవుతుందని హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. మొబైల్ ఫోన్‌లోని సాక్ష్యం చెల్లుబాటవుతుందని చెప్పారు.