కొత్త ఎత్తిపోతల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తదుపరి ముందుకెళ్లకుండా ఆదేశాలు జారీ చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్‌తో పాటు కృష్ణా బోర్డు ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్‌ను రజత్ కుమార్ కలిశారు.
ఏపీ ఉత్తర్వుపై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలు వివరించామని రజత్ కుమార్ వెల్లడించారు. ప్రాజెక్ట్ చేపడితే తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని వివరించామన్నారు. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్ట్ చేపట్టరాదన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు తెలిపారు. ఈ విషయాన్ని జనవరిలోనే బోర్డు దృష్టికి తీసుకొచ్చినట్లు కూడా గుర్తు చేసినట్లు రజత్ కుమార్ పేర్కొన్నారు.
చర్చలో అన్ని విషయాలపై మాట్లాడాం. మేము వివరించిన విషయాలపై బోర్డు ఛైర్మన్ సానుకులంగా స్పందించారు. ప్రాజెక్టు ఒక్కసారి ప్రారంభమైతే ఎలాంటి సమస్యలు వస్తాయనే విషయాలపై కూడా చర్చించాం. బోర్డుకు ఉన్న అధికారాలతో ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవి తీసుకుంటామని చెప్పారు.