ఆధార్ కార్డుల్లో పుట్టినతేదీ మార్పిడి.. పెద్ద వ్యాపారంగా తయారైంది. ఒక్కో కార్డులో వయసు మారిస్తే.. రూ.3-5 వేల వరకు వసూలు చేస్తున్నారు. కొందరు మీ-సేవ నిర్వాహకులతో పాటు బ్యాంకుల్లోని ఆధార్ కేంద్రాల్లో పనిచేసిన వారూ అనధికారికంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వాస్తవ వయసును మార్చి ప్రభుత్వ పథకాలకు అర్హత సాధించేలా చేస్తామంటూ సొమ్ము చేసుకుంటున్నారు. గుంటూరు అర్బన్, అనంతపురం జిల్లాల్లో పోలీసుల విచారణలో ఈ విషయాలు వెలుగుచూశాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇలాంటి వ్యవహారాలు బయటకొస్తున్నాయి.
అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లులోని మీ-సేవ కేంద్రానికి కడప జిల్లా నుంచి వాహనాల్లో వచ్చి వయసు మార్చుకుంటున్నారు. అక్కడ కొన్ని నెలలుగా ఈ తంతు నడుస్తోంది. తాడిపత్రి, గుంతకల్లు, కడవకల్లుల్లోని నాలుగు మీ-సేవ కేంద్రాల ద్వారా ఇలా జరుగుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. కొందరిని అరెస్టు చేశారు. గుంటూరులోనూ అక్రమాలు బయటపడ్డాయి. బ్యాంకుల్లో ఏర్పాటుచేసిన ఆధార్ కేంద్రాలు ప్రస్తుతం మూసేయడంతో.. గతంలో అక్కడ పనిచేసిన కొందరు అక్కడి కంప్యూటర్లతో సొంత దుకాణం తెరిచారు. సుమారు 200 వరకు కార్డులను ఇలా మార్చినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ అక్రమాలు వెలుగుచూశాయి. 2016లో కర్నూలు, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో కొందరు డీలర్లు నకిలీ వేలిముద్రలు సృష్టించారు.
ధ్రువీకరణలు ఉంటేనే మార్పు
ఆధార్‌లో పుట్టినతేదీ మార్చుకోవాలంటే.. 15 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాలి. పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రం, పదోతరగతి సర్టిఫికెట్, పాస్‌పోర్టు, పాన్‌కార్డు, పుట్టినతేదీతో విద్యాసంస్థ జారీచేసే గుర్తింపుకార్డు, పింఛను చెల్లింపు పత్రం తదితరాలు ఇవ్వాలి. ఆధార్ పొందిన ఏడాదిలోనే దీనికి వీలుంటుంది. పుట్టినతేదీ మార్చాలంటే ఏదో ఒక ధ్రువీకరణ పత్రాన్ని మీ-సేవ కేంద్రంలో ఇవ్వాలి. నిర్వాహకులు వీటిని స్కాన్ చేసి యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో దరఖాస్తుతోపాటు అప్‌లోడ్ చేస్తారు. తర్వాత యూఐడీఏఐ అధికారులు ఆన్‌లైన్లో వీటిని పరిశీలించి అన్నీ సక్రమంగా ఉంటే.. పుట్టిన తేదీ మార్చి ఆధార్ సరిదిద్దుతారు. మొబైల్ నంబరు, చిరునామా మార్పు, ఈ మెయిల్ మార్పు చేయాలంటే 24 గంటల్లో పూర్తవుతోంది.
*బ్యాంకుల్లో అసిస్టెంట్ మేనేజర్ స్థాయి, తపాలా కార్యాలయాల్లో పోస్టుమాస్టర్ స్థాయి అధికారులు పత్రాలను పరిశీలించి సంతకం చేశాకే.. అప్‌లోడ్ చేయాలి. మీ-సేవ కేంద్రాల్లో రిటైర్డ్ ఉద్యోగిని నియమించుకోవాలని సూచించినా, అది అమలు కావట్లేదు.